Amberpet | అంబర్‌పేట, జూలై 3 : బాగ్‌అంబర్‌పేట డివిజన్ సాయిమధురానగర్ నుంచి ఛే నెంబర్ వెళ్లే దారిలో గల ఇందిరానగర్‌లో గత పది రోజులుగా నల్లాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు వాపోయారు. ఇం.నెం : 2-2-1074/7/బి, షెర్టన్ బేకరీ లేన్‌లో గల ఇండ్లలో నలుపు రంగు నీరు సరఫరా అవుతుండడంతో వాటిని తాగలేక బయట నుంచి నీటి ట్యాంకర్లను కొనుక్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సంపులు పూర్తిగా కలుషిత నీటితో నిండిపోయాయని చెప్పారు. నల్లాల్లో కలుషిత మంచినీరు వస్తుందని సంబంధిత వాటర్‌వర్క్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టంచుకోవడం లేదన్నారు. ఈ నీటిని ఎలా తాగేదని ప్రశ్నిస్తున్నారు. పది రోజులైనా పట్టించుకోరా? అని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలుషిత మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.