సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారిలోని ఫుట్‌పాత్‌లు, క్యారేజ్ వేలను ఆక్రమిస్తూ పాదచారులకు, ట్రాఫిక్ ఇబ్బందులు కల్గిస్తున్న ఆక్రమణలు తొలగించి సాఫీగా ట్రాఫిక్ సాగేలా చేయడానికి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ (రిమూవల్ ఆఫ్ అబస్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్)ను చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ మొదటి సారి బాధ్యతలు నిర్వహించిన సమయంలోనే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఆయన బదిలీ అయిన తరువాత ఈ ప్రాజెక్ట్‌ను క్షేత్ర స్థాయిలోని పోలీసులు అటకెక్కించారు. రెండోసారి ఆయన తిరిగి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత హైదరాబాద్‌లో ట్రాఫిక్ అవస్తలకు చెక్ పెట్టేందుకు అపరేషన్ రోప్‌ను తిరిగి ప్రారంభించారు. టోలీచౌకీలో స్వయంగా సీపీ వెళ్లి ప్రారంభించడంతో పాటు నగరంలోని అన్ని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో రోప్‌ను నిర్వహించారు. ఫలాన పోలీస్‌స్టేషన్‌లో ఫలాన చోట రోప్ నిర్వహించామంటూ క్షేత్ర స్థాయిలోని అధికారులు ఉన్నతాధికారులు వాట్సాప్‌లో ఫొటోలు పెట్టి మరి మార్కులు కొట్టేశారు. ఆపరేషన్ రోప్ బాగానే జరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తూ వస్తున్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో రోప్ నిర్వహించిన మరుసటి రోజే అదే స్థానంలో తిరిగి ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు జరుగుతున్నాయి. రోప్ అమలుకు ముందున్న పరిస్థితి తిరిగి మరుసటి రోజు వచ్చేస్తోంది. దీంతో అక్కడ రోప్ నిర్వహించి ఏమి లాభమంటూ స్థానికులు పేర్కొంటున్నారు. రోప్ అంటూ హడావిడి చేయడం ఎందుకు? దానిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం ఏంటి? అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
కొనసాగుతున్న ఫుట్‌పాత్ మాఫియా..
నగరంలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చేపట్టిన రోప్‌తో ఫుట్‌పాత్ ఆక్రమణలు క్లియర్ అయ్యాయంటే రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సాఫీగా పోతుంది. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ మాఫియా కొనసాగుతుంది. ట్రాఫిక్ పోలీసులలో కొందరు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు, అయితే, రాజకీయ నాయకుల జోక్యంతో కొందరు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరికొందరు గట్టిగా ప్రయత్నం చేసి, వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించలేక చేతులెత్తేస్తున్నవాళ్లు ఉన్నారు. మరికొందరు నెలవారీగా వచ్చే మామూళ్లకు అలవాటు పడిచూసీచూడనట్లు ఉండేవాళ్లు సైతం ఉన్నారు. ఆపరేషన్ రోప్‌తో సత్ఫలితాలు వస్తుంటాయి. ఫుట్‌పాత్‌ను పాదచారులు నడిచేందుకు మాత్రం ఉపయోగించాలి. ఆ ఫుట్‌పాత్‌ను కొందరు కిరాయికి ఇస్తున్నారు. మరికొందరు ఆక్రమించేస్తున్నారు. ఒక టిఫిన్ సెంటర్ ఉందంటే లోపల టిఫిన్స్, బయట ఛాయ్ బండి ఉంటుంది. ఛాయ్ బండి వేరే వాళ్లది నెలవారీగా కిరాయి తీసుకుంటుంటారు. బట్టల షాపు ఉందంటే.. దాని అనుబంధంగా ఉండే మరో చిరు వ్యాపారాన్ని తన దుకాణం ముందు పెట్టించి నెలవారి కిరాయి తీసుకుంటున్న వాళ్లు ఉంటున్నారు. ఫుట్‌పాత్‌లపై తోపుడు బండ్లు, టీ స్టాల్స్, బట్టల దుకాణాలు, హోటల్స్, టిఫిన్ సెంటర్స్ వంటివి ఎన్నో వెలుస్తున్నాయి. ఫుట్‌పాత్‌లపై చిన్నపాటి హోటల్స్‌నే నిర్వహిస్తున్నారు. ఇలాంటి హోటల్స్ నిర్వాహకులు ఎక్కడో ఉంటారు. దానిని కొందరు కిరాయికి ఇవ్వడంతో పాటు మరికొందరు ఆ హోటల్‌ను తమ సొంతంగానే నిర్వహిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇలా హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ వ్యాపారులను ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఆక్రమించేస్తున్నారని స్వయానా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
హడావిడి చేస్తే లాభం లేదు…!
రోప్ అనేది దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌గా నడువాల్సిన అవసరముంది. ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే వెంటనే తొలగించేస్తారనే భయం అక్కడ వ్యాపారాలు నిర్వహించే వారిలో రావాలి. ఇందుకు జీహెచ్ఎంసీ సహకారం కూడా పోలీసులకు ఎంతో అవసరముంటుంది. జీహెచ్ఎంసీ కొందరి వద్ద ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు చేసేందుకు జరిమానాలు వసూలు చేస్తుంది. అయితే, ఎంతో కొంత జరిమానా చెల్లిస్తూ కొందరు వ్యాపారులు అక్కడే తిష్ట వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని ట్రాఫిక్ పోలీసులు రద్దీ సమయంలో రోడ్లపై ట్రాఫిక్ క్రబద్ధీకరణకు ఉంటారు. ఉదయం సాయంత్రం వేళల్లో చలాన్లు వేయడం, వసూళ్లు చేయడంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. అలా కాకుండా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే విధంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు ఉంటే వాటిని దీర్ఘకాలిక ప్రాతిపదికన తొలగించాల్సిన అవసరముంది. ఉన్నతాధికారులు సైతం తరచు క్షేత్ర స్థాయిలో పర్యటించడం వల్ల ఏమి జరుగుతుందనేది పక్కాగా తెలుస్తోందని ప్రజలు సూచిస్తున్నారు.
అనుమతుల్లేకుండా.. నిర్మాణాలేంటి?