బంజారాహిల్స్,జూన్ 16 : సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి సెక్స్ ట్రాప్ చేస్తున్న ముఠాలో మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రధాన నిందితుడు కోడూరు చంద్రశేఖర్ సోదరుడు రాజీవ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. నెలరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన జూబ్లీహిల్స్ రిచ్‌కిడ్స్ సెక్స్ట్రాప్ కేసులో మొత్తం 9మంది నిందితులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లో బాలికపై లైంగికదాడి కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు కోడూరి చంద్రశేఖర్ అజాద్ అలియాస్ అర్జున్‌తో పాటు పలువురు నిందితులు అరస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కాగా ఈ ముఠాపై వివిద పోలీస్స్టేషన్లలో మొత్తం 5 కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో అర్జున్ సోదరుడు రాజీవ్‌ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు అతడిని బెంగళూరుకు తీసుకువెళ్లారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో సైతం కొంతమంది యువకులు ఈ ముఠాతో కలిసి యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. కాగా నిందితుడు రాజీవ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భాగంగా కీలక ఆధారాలు లభ్యం కావడంతో వాటిని నిర్దారించుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా జూబ్లీహిల్స్‌లో లైంగికదాడికి గురైన బాలిక కుటుంబసభ్యులను సైతం భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు అర్జున్ తల్లి మీనాకుమారితో పాటు మేనమామపై మరో కేసు నమోదైన నేపథ్యంలో కేసులో మరిన్ని సాక్ష్యాలను సంపాదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
లగ్జరీ లైఫ్‌ైస్టెల్ ఉన్నట్లు యువతులను నమ్మించేందుకు సోషల్‌మీడియా రీల్స్ ద్వారా వలవేస్తూ అనేకమంది సంపన్న బాలికలకు సెక్స్ వల వేసిన విష సంస్కృతికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను సోమవారం నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఏర్పాటు చేశారు. వెస్ట్‌జోన్ డీసీపీతో సహా ఇద్దరు డీసీపీలు, బంజారాహిల్స్ ఏసీపీ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఇన్స్పెక్టర్ రవికుమార్‌తో పాటు మరో ఇద్దరు ఎస్ఐలతో ఏర్పాటు చేసిన సిట్ బృందం రిచ్‌కిడ్స్ వ్యవహారంలో మరింత లోతుగా విచారించేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణలో సేకరించిన ఆధారాలను, కేసు దర్యాప్తు వివరాలను సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అరస్టై నిందితులను మరోసారి విచారించడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ ముఠాతో పాటు మరికొందరు యువకులు సైతం ఇదే తరహాలో రిచ్కిడ్స్ను ట్రాప్ చేసినట్లు సిట్ బృందం అనుమానిస్తుంది. సిట్ ఏర్పాటుతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుందని అధికారులు తెలిపారు.