వెంగళరావునగర్, మే 11 : ఆ నేపాల్ దొంగ పోలీసులకు చిక్కినా మస్కా కొట్టి మాయం అవుతాడు.. పోలీసుల కస్టడీ నుంచి కళ్లుగప్పి తప్పించుకుంటాడు.. అలా రెండు సార్లు చిక్కినట్టే చిక్కి పరారయ్యాడు.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పోలీసులు అతని జాడను గుర్తించలేకపోయారు. నిందితుడు దేశ సరిహద్దులు దాటేసి ఉంటాడని భావిస్తున్నారు.
మధురానగర్ పోలీస్‌స్టేషన్ నుంచి పోలీసులకు మస్కా కొట్టి ఆ దొంగ రెండుసార్లు పారిపోయాడు. ఇది పోలీసుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. గతేడాది ఆగస్టులో యాదగిరినగర్ బస్తీలోని ఇళ్లలోని నల్లా ట్యాపులు చోరీచేసే దొంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదే పదే ఇండ్లలో నల్లాలు చోరీకి గురవుతుండడంతో బస్తీవాసులే దొంగ ను ఎలాగైనా పట్టాలని దృఢ సంకల్పం తో ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. దొంగ ఓ ఇంట్లోకి జొరబడి వాటర్ ట్యాపులు కాజేసి ఉడాయించడం సీసీ కెమెరాల్లో రికార్డయింది.
దొంగ చోరీ చేసే వీడియోను బస్తీవాసుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. బస్తీ వాసులంతా చైతన్యవంతులై అప్రమత్తంగా ఉండి గతేడాది ఆగస్టు ఒకటో తేదీన నేపాల్‌కు చెందిన దొంగ వికాస్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి మధురానగర్ పోలీసులకు అప్పగించారు. పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల కళ్లు గప్పి నిందితుడు వికాస్ పరారయ్యాడు. అయితే కొద్ది రోజులకే ఓ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని మధురానగర్ పోలీసులకు అప్పగించారు.
ఠాణానుంచి ఆ దొంగ మరోసారి పారిపోయాడు. ఇప్పటికే అతనిపై మధురానగర్ ఠాణాలో పలు కేసులు నమోదయ్యాయి. 9 నెలలు గడిచినా ఆ నిందితుడ్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. చోరీ కేసు నిందితుడు వికాస్ ఎప్పుడో దేశ సరిహద్దులు దాటి తన దేశమైన నేపాల్‌కు వెళ్లి అక్కడే నక్కి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిందితుడ్ని పట్టుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.