సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): నగరంలోని విద్యావ్యవస్థ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సివిల్ పంచాయితీలో తలదూర్చుతున్న ఈస్ట్‌జోన్ పరిధిలోని ఎస్హెచ్ఓకు సపోర్ట్ చేసిన ఓ ఎస్బీ అధికారి…
బంగ్లా మహిళను బంధించి అక్రమంగా వ్యభిచార కూపంలోకి దింపిన వారిపై కేసు లేకుండా చేయడంలో స్థానిక అధికారికి సహకరించిన మరో ఎస్బీ ఏఎస్ఐ..
తన పరిధిలో కాకపోయినా నగరంలోని ధనికులు ఉండే ప్రాంతానికి చెందిన ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భూ పంచాయితీలో జోక్యం చేసుకున్న స్థానిక అధికారిపై నివేదిక ఇవ్వాల్సిన చోట తారుమారు చేసిన ఇంకొక స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్.. ఇలా నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వాల్సిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్థానిక పోలీసు అధికారులతో కుమ్ముక్కై చేస్తున్న బాగోతాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలే ఇవి. కొందరు ఖాకీల వ్యవహారాలపై తప్పుడు నివేదికలు ఇవ్వడం, కొన్ని పై అధికారుల దృష్టికి వెళ్లకుండా కిందిస్థాయిలోనే మేనేజ్ చేయడం వంటివి చేస్తున్న ఎస్బీ అధికారుల చిట్టా మొత్తం పోలీస్ బాస్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న కొందరు వసూల్ రాజాలపై ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. ఏండ్ల తరబడి ఎస్బీలో తిష్టవేసి.. కొందరు అవినీతి ఖాకీలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలతో ఈ విచారణ మొదలు పెట్టారు. పోలీస్‌స్టేషన్‌లో జరిగే అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదికలు ఇవ్వాల్సిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అక్కడ జరిగే అవినీతి, అక్రమాల్లో వాటాలు పంచుకుంటున్నారని ,వారిపట్ల కఠినంగా వ్యవహరించడానికి ఉన్నతాధికారులు సిద్ధ్దమైనట్లు సమాచారం. ప్రతీ పీఎస్ లోని పోలీసు సిబ్బంది పనితీరుపై దృష్టి సారించే స్పెషల్ బ్రాంచ్ పోలీసులపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా సారించారు.
స్థానిక అధికారులతో మిలాఖత్ ..!
పోలీసుశాఖకు ఆయువుగా ఉన్న ఎస్బీలో కొంతమంది పనితీరుతో, పోలీసుశాఖకి మాయనిమచ్చగా మారుతున్న పరిస్థితులపై దృష్టిసారించిన అధికారులు.. అందుకు గల కారణాలు తెలుసుకునే పనిలోపడ్డారు. ఈ మేరకు ఎస్బీ పోలీసుల పనితీరును మెరుగుపరిచేందుకు పోలీసు బాసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పాస్‌పోర్టు ఎంక్వయిరీ, కమిషనరేట్ లోని పలు ఠాణాల్లో జరిగే ఆవినీతి, అక్రమాల్లో వాటాలు పంచుకునే ఎస్బీ పోలీసులపై ఆ విభాగంలోని ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు.
కొన్ని జోన్లలో స్థానిక అధికారులతో కలిసి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అక్కడ ఉండే రియల్టర్లకు, అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని పోలీస్ బాసులకు ఫిర్యాదులందాయి. కొందరు మధ్యవర్తిగా వ్యవహరించి కేసులు సెటిల్ చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నట్లుగా కూడా పోలీస్‌శాఖలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తాల్లో తమ వంతు వాటా తీసుకున్న తర్వాత స్థానిక ఉన్నతాధికారి వరకు వాటాలు ఇవ్వడంతో ఎస్బీ అధికారులు ఆ స్టేషన్ తమదే అన్న లెవల్ల్లో సెటిల్మెంట్లు చేస్తున్నారు.
స్కామ్ల్లోనూ పెద్ద పాత్రే..!
నగరంలో జరిగే నకిలీ వ్యవహారాల్లో టాస్క్‌ఫోర్స్, ఎస్బీ పాత్ర చాలా ముఖ్యమైనదని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. నెలవారీ మామూళ్లు అందకపోతే వారి పని ఖతమేనని, ఏదో ఒక కేసులో నకిలీగాళ్లను ఇరికిస్తారని, అందుకే ప్రతీనెలా లక్షల రూపాయల్లో మామూళ్లు అందుతాయని ఆ అధికారి తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో ఇటీవల జరిగిన నకిలీ జీఎస్టీ స్కామ్‌లో కూడా ఎస్బీ పోలీసుల పాత్ర ఉందన్న సమాచారంతో ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. కొందరు నకిలీ జీఎస్టీతో అక్రమ వ్యాపారాలు చేసే వారు ఎస్బీ క్రైమ్ పోలీసులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తారు.
ఈ క్రమంలో ఆ ప్రాంతంలో స్క్రాప్ దుకాణంలో నగరంలో చోరీ చేసిన వస్తువులు ఉన్నట్లు కనిపెట్టారని, వీటి విచారణ నిమిత్తం ఎవరైనా కొత్తగా పోలీసులు వస్తే వారిని కోఆర్డినేట్ చేయడం కూడా ఎస్బీ అధికారులే చూస్తారని ఆ అధికారి చెప్పారు. ఈ విషయంలో ఒకవేళ సదరు కొత్త అధికారులు వినకపోతే నయానో, భయానో వినిపించుకోవడంలో కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారి వరకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ దర్యాప్తులో తేలినట్లు తెలిసింది.
సీరియస్‌గా తీసుకున్న పోలీస్‌బాస్..
పోలీసుల పనితీరుపై నివేదికలివ్వాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడితే ఎలా? అంటూ ప్రజల్లో జరుగుతున్న చర్చపై పోలీసు బాసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు డీజీపీ కార్యాలయంతో పాటు సీపీ కార్యాలయాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సెల్‌కు పోలీసులపై పోలీసులే ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువ కాబట్టి ఇక్కడ నిజాయతీ కలిగిన ఆఫీసర్లను ఏర్పాటు చేయాలని సీపీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మరో వైపు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై అంతర్గత విచారణ చేపట్టి అక్రమార్కులపై వేటు వేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.ఇదే సమయంలో ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదికలను బట్టి ప్రాథమికంగా ఎంతో కాలంగా ఎస్బీలో తిష్టవేసుకుని ఉన్న అధికారులపై బదిలీ వేటు వేయడానికి కూడా జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది.