సిటీ బ్యూరో, జూన్ 2 : అరాచకాలు, ఆగడాలు, దౌర్జన్యాలతో ప్రజల్ని భయకంపితుల్ని చేసి ఆత్మహత్యలకు కారణమవుతున్న బోరబండ కార్పొరేటర్ బాబా ఆచూకీ పోలీసులకు ఇప్పటికీ లభ్యం కాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. బీఆర్ఎస్ బోరబండ మైనార్టీ డివిజన్ నాయకుడు మహ్మద్ సర్దార్ ఆత్మహత్యకు కారకుడైన బాబాను పోలీసులు పట్టుకోవడంలో జరుగుతున్న జాప్యంపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కేసు నమోదై 5 రోజులు గడిచినా అతను ఎక్కడున్నాడో ఇప్పటికీ పోలీసులు కనిపెట్టలేకపోవడంపై విమర్శలకు తావిస్తున్నది.
దౌర్జన్యాలు.. దాదాగిరి, బెదిరింఫులకు పాల్పడే బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ను ఎవరు కాపాడుతున్నారు? అతని వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఇంకా అరెస్ట్ కాకపోవడంతో అనుమానాలు బలపడ్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఒత్తిడితోనే బాబాని అరెస్ట్ చేయకుండా ఖాకీలు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ బోరబండ మైనారిటీ విభాగం నాయకుడు మహ్మద్ సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, అతని భార్య హబీబా సుల్తానా, కార్పొరేటర్ పీఏ సప్తగిరి ల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఐదు రోజులుగా ఈ కేసులో నిందితులు కార్పొరేటర్ బాబా, అతని భార్య హబీబా సుల్తానా, కార్పొరేటర్ పీఏ సప్తగిరిలు ఎక్కడున్నారు? వారికి ఆశ్రయం ఎవరిచ్చారు? నిందితులు ఫోన్లు వాడుతున్నారా? ఒకవేళ వాడితే వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నారు? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఐదు రోజుల నుంచి పోలీస్ బృందాలు గాలిస్తున్నా..బాబా చిక్కకపోవడానికి కారణమేంటి ? పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి కేసు దర్యాప్తులో కావాలనే జాప్యం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ కేసులో స్వాధీనం చేసుకున్న సర్దార్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. కార్పొరేటర్ బాబా బ్లాక్ మెయిలింగ్ కు సంబంధించిన క్లూస్ సేకరించాలని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం విశ్లేషించి ఇచ్చే నివేదిక కీలకంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు.