సిటీబ్యూరో/వెంగళరావునగర్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): ఠాణా నుంచి కోర్టుకు ఫైల్ వెళ్లాలన్నా… కోర్టులో బెంచ్‌పై ఫైల్ కదులాలన్నా ఆయా పోలీస్స్టేషన్లకు చెందిన కొంత మంది కానిస్టేబుళ్ల చెయ్యి తడపాల్సిందే. నిందితుడు, వారి తరఫు బంధువులో, న్యాయవాదో ఆ కానిస్టేబుళ్ల జేబులో కొంత బరువు పెడితేనే అక్కడ పని అవుతుంది. పోలీస్‌స్టేషన్‌కు, కోర్టుకు అనుసంధానంగా ఉండే ఈ కోర్టు కానిస్టేబుల్స్‌పై పలు ఆరోపణలు వస్తున్నా వారిపై మాత్రం అధికారులు చర్యలు తీసుకోరు. కోర్టులో పని కావాలంటే ఆ కోర్టు కానిస్టేబుళ్లతోనే ఆయా ఎస్హెచ్ఓలు, ఏసీపీలు, డీసీపీలు పని చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా కోర్టు కానిస్టేబుల్స్ అధికారులను సైతం ఆడిస్తుంటారు. ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి ఆయా కోర్టు వ్యవహారాలు చూసేందుకు కానిస్టేబుల్స్ ఉంటారు. నిందితుడు అరస్టైయి కోర్టుకు వెళ్లాడంటే అక్కడి నుంచి కోర్టు కానిస్టేబుళ్ల ముడుపుల వ్యవహారం ప్రారంభమవుతుంది.
కోర్టులో సరైన సమయానికి జడ్జీ ముందు ప్రవేశపెట్టాలన్నా ఆ కోర్టు కానిస్టేబుల్ చేతిలోనే ఉంటుంది. రిమాండ్ నుంచి ట్రయల్స్ వరకు వీళ్లతో పని ఉంటుంది. కోర్టు కానిస్టేబుళ్ల వ్యవహారం తెలిసినా కూడా అన్ని వ్యవస్థలు మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి. నిందితుడు బెయిల్ పిటిషన్ వేసుకున్నా, దానికి కౌంటర్ వేయాలంటే పోలీస్‌స్టేషన్ నుంచి ఫైల్స్ తీసికెళ్లి పీపీకి ఇవ్వాలి, ఆ తరువాత పీపీ కౌంటర్ వేస్తాడు. పోలీస్‌స్టేషన్ నుంచి అన్ని ఫైల్స్ తీసుకొచ్చేందుకు ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిందే. పోలీసులు రికవరీ చేసిన వస్తువులు కోర్టులో జమ చేయాలన్నా, జమ చేసిన వస్తువులు బాధితులు ఇప్పించాలన్నా, వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయాలన్నా అన్నింటికీ కానిస్టేబుళ్ల చెయ్యి తడపాల్సిందే. ప్రతి రెండేళ్లకోసారి కోర్టు కానిస్టేబుళ్లను మార్చాలంటూ బార్ అసోసియేషన్లు ఉన్నతాధికారులకు పలు వినతిపత్రాలు అందించినా, వారికి అన్ని తెలుసంటూ ఉన్నతాధికారులు సైతం ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తుంటారు.
శిక్ష పడాలా? కొట్టేయాలా..?
కేసుల్లో నిందితులకు శిక్ష పడాలన్నా, ఆ కేసు కొట్టేయాలన్నా ప్రధాన భూమిక కోర్టు కానిస్టేబుళ్ల చేతిలోనే ఉంటుంది. ఆయా కేసుల్లోని సాక్ష్యులకు సమన్లు జారీ చేసి వాళ్లను కోర్టుకు తీసుకొచ్చే బాధ్యత కోర్టు కానిస్టేబుళ్లదే కావడం ఇందుకు ప్రధాన కారణం. కొందరు కానిస్టేబుల్స్ సాక్ష్యులను కూడా ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిందితులు డబ్బున్న వారైతే కానిస్టేబుళ్లను మేనేజ్ చేసుకుంటూ ఒక ఒప్పందం చేసుకుంటారని సమాచారం. దాంతో సాక్ష్యులను రాజీకుదిర్చి కోర్టులో ఆయా కేసుల్లో సాక్ష్యం లేకుండా చేయడం, తప్పుగా చెప్పడం వంటివి కూడా చేస్తున్నారనే ఆరోపణల ఉన్నాయి. కోర్టు కానిస్టేబుల్స్‌తో పెట్టుకుంటే ఏదైనా జరగొచ్చనే భయంతో నిందితులు నోరు మెదపకుండా అడిగినంతా ఇచ్చేస్తున్నారని సమాచారం. లోక్ అదాలత్ వచ్చిందంటే అటూ ఫిర్యాదుదారులు, ఇటూ నిందితులిద్దరిని పిలిపించడం, వారిని కొన్ని సందర్భాల్లో బలవంతంగా రాజీ కుదిర్చి రెండు వైపుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వాళ్లు కూడా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కోర్టు కానిస్టేబుళ్లలో కొందరు నిజాయితీగా పనిచేస్తున్నా.. చాలా మంది ప్రతిరోజు జేబు నింపుకోకుండా ఇంటికి వెళ్లరనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా కేసులను బట్టి వీళ్లు సాధారణ ఠాణాల్లో ప్రతిరోజు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు కనీసం వసూలు చేస్తున్నట్లు, వెస్ట్‌జోన్‌లోని కొన్ని పోలీస్స్టేషన్లలో కొందరు కానిస్టేబుల్స్ రోజు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెల వారీగా లక్షల్లో టార్గెట్లు పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే మార్నింగ్ కోర్టుల వద్ద సైతం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన కోర్టు కానిస్టేబుళ్లు వసూళ్ల పర్వం నిరాటంకంగా జరుగుతుందనే ఆరోపణలున్నాయి. గత నెల 13వ తేదీన వెస్ట్‌జోన్‌లోని ఒక ఠాణాలో అన్నదమ్ముళ్ల మధ్య జరిగిన గొడవపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగస్తుడితోపాటు అతడి కొడుకును చేర్చారు. ఛార్జీషీట్ వేసి కోర్టుకు రమ్మని చెప్పారు. అయితే ‘కోర్టులో మీ ఫైల్ పెట్టాలంటే మాకు రూ.5వేలు ఇవ్వాందే’ అంటూ డిమాండ్ చేసి చివరకు రూ.3వేలు వసూలు చేశారు. అయితే కోర్టులోనే ఒక గదిలో తలుపులు మూసి ఈ కానిస్టేబుళ్లు తమ అవినీతి దందా చేయడం కొసమెరుపు.