హైదరాబాద్: హైదరాబాద్‌లో చైతన్యపురిలో స్పా సెంటర్లపై (Spa Centers) పోలీసులు దాడులు నిర్వహించారు. వాసవీ కాలనీ, కొత్తపేట, నాగోల్, సాయినగర్, అల్కాపురిలో అక్రమంగా నడుస్తున్న ఎనిమిది స్పా సెంటర్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వాహకులు, మేనేజర్లు, సిబ్బంది, కస్టమర్లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మరికొందరు స్పా యజమానులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రెండు నెలల క్రితం అమీర్‌పేటలోని ఎంఎస్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి ఆరుగురు యువతులు, విటుడితో పాటు సబ్ ఆర్గనైజర్ ఉషశ్రీని ఆరెస్ట్ చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన.. యాప్రాల్ జ్యోతి, ఉషాశ్రీలు అమీర్‌పేటలోని శాంతి నిలయం అపార్ట్మెంట్లో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇందులో గత కొంత కాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆరుగురు యువతులు, చాంద్రాయణగుట్టకు చెందిన విద్యార్థి షేక్ రహీంలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.