సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): మహిళలు, పురుషులకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేసి.. ఫ్లాటునే పేకాట డెన్‌గా మార్చేసి..కాయ్ రాజా కాయ్ అంటున్న ఓ బీజేపీ నాయకుడి మినీ పేకాట క్లబ్ వ్యవహారం బంజారాహిల్స్ పోలీసుల నిఘాలో బయటపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పేకాట క్లబ్బులు మూతపడ్డాయి. వ్యవస్థీకృత నేరాలను ప్రభుత్వం అణిచివేసింది. పేకాట ఆడేవాళ్లు నగరంలో పూర్తిగా తగ్గిపోయారు. అక్కడక్కడ వెలుగులోకి వస్తున్నా.. పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో బీజేపీ నాయకుడు బండపల్లి సతీశ్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెల్ అపార్టుమెంట్‌లోని ఒక ఫ్లోర్ మొత్తాన్ని మినీ పేకాట క్లబ్‌గా మార్చాడు. విందు, మందు ఏర్పాటు చేసి, జూదగాళ్లను రప్పిస్తున్నాడు. మహిళలు కూడా తన క్లబ్లో పేకాట ఆడుకోవచ్చంటూ.. వాళ్లకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశాడు. ఈ మినీ క్లబ్లో ఒక్కో ఆటకు టేబుల్‌కు రూ. 5 వేలు చార్జీ వసూలు చేస్తున్నాడు. ప్రతి రోజు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బుధవారం ఈ పేకాట డెన్‌పై పోలీసులు దాడి చేసి.. నిర్వాహకుడు సతీశ్‌తో పాటు 11 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఆరుగురు మహిళలు ఉన్న విషయం తెలిసిందే.