బంజారాహిల్స్: పందెం కోడిని కోసుకుతింటారని.. భావించి..వేలం పాటలో ఆ కోడిని దక్కించుకొని..మూగ జీవాలపై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడో వ్యాపారి. ఇటీవల అత్తాపూర్ పరిధిలో కోళ్ల పందేలపై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఉప్పర్‌పల్లిలోని కోర్టులో నిందితులకు జరిమానా విధించిన న్యాయమూర్తి.. పట్టుబడిన పందెం కోడిని వేలం వేయాలని ఆదేశించారు.
కోర్టులో వేలం పాట నిర్వహించగా, వ్యాపారి రామకృష్ణ..ఆ కోడిని రూ. 2800కు దక్కించుకున్నాడు. మూగజీవాలపై ప్రేమ కలిగిన అతడు.. వేరేవాళ్లు ఆ కోడిని కోసుకొని తింటారని భావించి..వేలం పాటలో పాల్గొన్నాడని బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ చెప్పారు. ఆ కోడిని రామకృష్ణ తన ఫామ్ హౌస్‌లో పెంచుకుంటారన్నారు. రామకృష్ణను అసోసియేషన్ తరఫున సన్మానించినట్లు బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దామోదర్‌గౌడ్ తెలిపారు.