Hyderabad | సిటీబ్యూరో/ చార్మినార్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో సిటీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. సున్నిత ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తానీయులను వెనక్కు పంపడంపై కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా వారి వివరాలపై ఆరాతీస్తున్నారు. ఇప్పటివరకు ఎస్బీలో రిజిస్టర్ చేసుకున్నవారెందరు, ప్రస్తుతం అనధికారికంగా ఎంతమంది ఇక్కడ నివాసముంటున్నారు. అసలు వారు చేస్తున్న పనులేంటనే విషయాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పాతబస్తీలోని పలుప్రాంతాల్లో తమ ఇన్ఫార్మర్లను అడిగితెలుసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో రెండు ప్రధాన కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు కేంద్రం అన్ని రాష్ర్టాలలో ఉన్న పాకిస్తానీయులను వెనక్కు పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాష్ర్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఈ మేరకు ముందుగా స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి వారి వివరాలను కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాక్ జాతీయులకు భారత్‌లో పర్యటించే అవకాశం కల్పించారు. ఈ ప్రోగ్రామ్ కింద ఎవరైనా ఉంటే 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఉంది.
భారత్‌తో పాకిస్తాన్ సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలో ఉన్న పాకిస్తానీయులను బయటకు పంపడానికి కేంద్రం సిద్ధమైంది. ఈమేరకు అన్ని రాష్ర్టాలకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పాకిస్తానీయుల వివరాల సేకరణలో ఇంటిలిజెన్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌కు వచ్చే అన్ని దేశాల వాళ్లు తమ వివరాలను శంషాబాద్‌లోని మామిడిపల్లి వద్దనున్న ఫారినర్స్ రీజనల్ రిజిస్టేష్రన్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలి. పాక్, బంగ్లా దేశీయులు మాత్రం పాతబస్తీలోని పురానాహవేలిలో ఎస్బీ ఆధీనంలో ఉన్న పాక్, బంగ్లా కార్యాలయాల్లో రిజిస్టేష్రన్ చేయించుకోవాలి. ఈ విభాగంలో ఇప్పటివరకు 208 మంది పాకిస్తానీయులు రిజిస్టరై ఉన్నారు.
ఇందులో లాంగ్‌టర్మ్ వీసా కలిగినవాళ్లు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న వారితో పాటు వారి రక్త సంబంధీకులకు ఈ వీసాలు జారీ చేస్తూ ఉంటారు. మరో 13 మంది విజిట్, బిజినెస్ వీసాలు(షార్ట్ టర్మ్)వీసాలు కలిగి ఉండగా, మిగతావన్నీ మెడికల్ వీసాలని పోలీసులు చెబుతున్నారు. నగరంలోని పాకిస్థానీల్లో సార్క్ వీసా కలిగిన వాళ్లెవరూ లేరని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నగరంలోని పాకిస్తానీయులు ఎక్కువగా నివసిస్తున్న పాతబస్తీ ప్రాంతంలో పోలీసులు స్పెషల్ వెరిఫికేషన్ డ్రైవ్ చేపట్టారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎంతమంది అక్రమంగా హైదరాబాద్‌లో ఉన్నారనే దిశగా పోలీసుల డ్రైవ్ జరుగుతోంది.
మరికొందరు బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చి ఇక్కడే ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు తయారు చేసుకుని తమ ఐడెంటీని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వారి విషయంలో కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. నగరంలో ఉన్న పాకిస్తానీల్లో ప్రస్తుతం ఎంత మంది హైదరాబాద్ లో ఉన్నారు.. ఎవరెవరు పాకిస్తాన్‌కు రిటర్న్ వెళ్లారనే వివరాలను ఇమ్మిగ్రేషన్ నుంచి పోలీసులు తీసుకుంటున్నారు. మరి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లారనేది మాత్రం ఖచ్చితమైన వివరాలు ఇంకా పోలీసులకు అందలేదు.
మరోవైపు కేంద్రం చాలా సీరియస్‌గా సిటీలో ఉన్న పాకిస్తానీయులను వెనక్కు పంపాలని ఆదేశాలు జారీ చేయడంతో వారి లో కొందరు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. పాతబస్తీలోని పలుప్రాంతాల్లో ఈ విధంగా తలదాచుకున్నవారి వివరాలు సేకరిస్తూనే వారిని బలవంతంగా తిరిగి వెన క్కు పంపడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ఉన్నట్లుగా తేలితే వారిని, వారికి ఆశ్రయమిచ్చిన వారిపై కఠినచర్యలు తప్పవని, ఇది దేశభద్రతకు సంబంధించిన అంశమని పోలీసులు హెచ్చరించారు.
పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో సిటీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హెచ్ఐసీసీలో శుక్ర, శనివారాల్లో భారత్ సమ్మిట్, వచ్చేనెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చే వారంతా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న హోటల్స్‌లో బసచేయనున్నారు. దేశంలో టెర్రరిస్ట్ హిట్ లిస్ట్‌లో ఉండే నగరాల్లో హైదరాబాద్ ఒకటి కావడంతో భద్రతను మరింత కట్టుదిట్లం చేస్తున్నారు.
నిఘావర్గాలు ఎప్పటికప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ తాజా పరిణామాలను, సిటీలో జరుగుతున్న వ్యవహారాలను ప్రత్యేకించి సున్నితమైన ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. నగరంలో అనుమానిత, సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక కార్యక్రమా లు, జాతీయ, అంతర్జాతీయ అతిథుల రాక సందర్భంగా తనిఖీలు కూడా ముమ్ము రం చేశారు. ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా హైదరాబాద్ మూలాలకు లింక్ ఉండే అవకాశముంటుందని,అందుకోసమే దేశంలో ప్రధా న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌లో ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు హైఅలర్ట్ ప్రకటించి భద్రత పెంచుతామని ఒక పోలీస్ అధికారి తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మక్కామసీదులో ముస్లింలు నల్ల రిబ్బన్లు దరించి ప్రత్యే క ప్రార్థనలు చేశారు. ఉగ్రవాద దాడిపై ఎంఐ ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపుతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనల అనంతరం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతదూరం ర్యాలీ నిర్వహించారు.మరోవైపు శాస్తిప్రురంలోని మసీదు వద్ద నమాజ్‌కు ముందు అసదుద్దీన్ ఒవైసీ నల్ల రిబ్బన్లు పంపిణీ చేశారు. ఆయన నల్ల రిబ్బన్‌ను దరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు.