సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): హిట్ అండ్ రన్ కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.. అర్ధరాత్రి కాదు… పట్టపగలు ఇలాంటి ప్రమాదాలు జరిగినా… సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తమైనా సరే.. నిందితులను పట్టుకోవడంలో విఫలమవుతుండడం బాధితులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. నేరాలు జరగకుండా, నేరం జరిగితే నేరస్థులను పట్టుకోవడానికి సాంకేతికపరంగా ఎన్నో అవకాశాలు పోలీసులకు ఉన్నాయి. అయినా బాధితులకు వెనుకా ముందు ఎవరు లేరంటే… ఆయా కేసులలో దర్యాప్తు నెలల తరబడి కొనసాగుతూ.. చివరకు ఆటకెక్కుతుంటాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హిట్ అండ్ రన్ ఘటనలో రెండు నెలలైనా నిందితులను పోలీసులు పట్టుకోకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కన్పిస్తోంది… ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఓ కారు షోరూం కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే అరుణ్, అఖిల్‌లు రోడ్డు దాటుతున్నారు. ఇంతలో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొడుతూ వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అఖిల్ తీవ్ర గాయాలకు గురై, నాగోల్‌లోని సుప్రజ దవాఖానలో చికిత్స పొందుతూ మార్చి 4న మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ఓ ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణమని గుర్తించారు.
పట్టపగలు అందరు చూస్తుండగా రోడ్డు ప్రమాదం చేసి తప్పించుకున్న వ్యక్తిని పట్టుకోవడంలో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరా దూరంగా ఉన్నా… ఆ వాహనం ఎటు నుంచి వస్తోంది… ఎటు వైపు వెళ్లిందనే విషయాన్ని గుర్తించి ఆ చుట్టు పక్కల సీసీ కెమెరాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించే అవకాశాలున్నాయి. ద్విచక్రవాహనానికి నెంబర్ ప్లేట్ లేకున్నా.. నిందితుడిని గుర్తించేందుకు వేరే మార్గాలున్నా… ఆ విషయాలను పట్టించుకోవడం లేదంటూ బాధితులు విమర్శిస్తున్నారు.
ఈ ఘటనలో నిందితులను పట్టుకున్నారా? ఇది రోడ్డు ప్రమాదమా? ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన ప్రమాదమా? దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా? అనే సందేహాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలలో రికాైర్డెన దృశ్యాలు చూస్తే ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన రోడ్డు ప్రమాదంగా కన్పిస్తోందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఎడమ వైపు నుంచి వెళ్తున్న ద్విచక్రవాహనం అరుణ్, అఖిల్‌లు రోడ్డు దాటుతున్న సమయంలో.. ఒకేసారి ఎడమవైపునకు వెళ్లి .. రోడ్డు దాటుతున్న అఖిల్‌ను ఢీకొట్టి అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. అవే దృశ్యాలు సీసీ కెమెరాలలోనూ కన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవాల్సి ఉన్నా, ఏదో మాములు రోడ్డు ప్రమాదంగా చూస్తూ… నిందితులను పట్టుకోవడం కోసం ఏ మాత్రం ప్రయత్నించడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిందితుల ఆచూకీ దొరికిందా? అంటూ మృతుడి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లో అధికారులు మారుతున్నారు కాని పట్టపగలు జరిగిన హిట్ అండ్ రన్ కేసులో మాత్రం నిందితులు దొరకడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పట్టపగలు ప్రధాన రోడ్డుపై జరిగిన హిట్ అండ్ రన్ కేసును ఛేదించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. నిందితుల ఆచూకీ దొరికినా కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. పట్టపగలు జరిగిన హిట్ అండ్ రన్ ఘటన రాత్రి వేళల్లో జరిగితే ఆ కేసులు పూర్తిగా నీరుగార్చే ప్రమాదాలున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని, సాంకేతిక పరిజానంతో నిందితుడిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.