మన్సూరాబాద్, మార్చి 21: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన ఓ యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడు బతికి ఉంటే.. చంపుతాడన్న భయంతోనే హత్యచేసినట్టు పోలీసుల దర్యాప్తులో ముగ్గురు నిందితులు తెలిపారు. నాగోల్‌లోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ ఏ.కృష్ణయ్య వివరాలు వెల్లడించారు.
నాగోల్, బండ్లగూడ, ఈశ్వరిపురికాలనీలో డేరంగుల మల్లికార్జున్ అలియాస్ మర్డర్ మల్లి (28), చైతన్యపురి నివాసి కొప్పుల అర్జున్ యాదవ్ అలియాస్ అర్జున్ (41), బోడుప్పల్‌కు చెందిన ఓంకార్ (30), అంబర్‌పేటకు చెందిన మహేశ్ (34) స్నేహితులు. వీరు వేర్వేరు వాహనాలు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నలుగురు స్నేహితుల్లో ఒకరైన మల్లికార్జున్ తరచూ మిగతా ముగ్గురిని బెదిరిస్తూ.. దాడులు చేశాడు. చాలా సందర్భాల్లో ముగ్గురిని చంపుతానని కూడా మల్లికార్జున్ బెదిరించాడు. గతంలో అర్జున్‌పై దాడి చేసిన ఘటనపై ఎల్బీనగర్ పీఎస్‌లో మల్లికార్జున్‌పై కేసు నమోదైంది.
ఆ తర్వాత స్నేహితుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కక్ష పెరిగింది. మల్లికార్జున్ తరచూ తన ముగ్గురు స్నేహితులను బెదిరించి మద్యానికి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వకుంటే దాడిచేసి, చంపేస్తానంటూ బెదిరించాడు. మల్లికార్జున్ తీరు అర్జున్‌యాదవ్, ఓంకార్, మహేశ్‌కు నచ్చలేదు. ఎప్పటికైనా మల్లికార్జున్‌తో తమకు ముప్పు తప్పదని గ్రహించారు. మల్లికార్జున్‌ను అడ్డు తొలగించుకోకపోతే తమకు ప్రాణహాని ఉందని ముగ్గురు భావించి హత్యకు పథకం వేసుకుని అదును కోసం ఎదురు చూశారు.
ఈనెల 18న అర్జున్‌యాదవ్ ఇంటికి వెళ్లిన మల్లికార్జున్ మద్యం కోసం డబ్బులు కావాలంటూ గొడవ పడ్డాడు. అనంతరం అదేరోజు రాత్రి మహేశ్‌తో కలిసి మద్యం తాగి.. ఆ మత్తులో మహేశ్‌ను కత్తితో పొడవగా.. అతడికి ఎనిమిది కుట్లు పడ్డాయి. దీంతో అర్జున్‌యాదవ్, ఓంకార్, మహేశ్ ఈ నెల 19న ఉదయం 11 గంటలకు రామంతాపూర్‌లోని ఓ బార్లో కలుసుకున్నారు. మల్లికార్జున్ తన మిత్రుడు అజయ్‌తో కలిసి నాగోల్‌లోని మూసీ వద్ద ఓ మర్రి చెట్టు కింద కూర్చుని మద్యం తాగుతున్నట్టు తెలుసుకున్నారు. ముగ్గురు కలిసి కారులో అక్కడికి వెళ్లారు. మద్యం అయిపోవడంతో మరో బాటిల్ కోసం అజయ్ వైన్స్‌కు వెళ్లాడు.
కారులో అక్కడికి చేరుకున్న అర్జున్‌యాదవ్, ఓంకార్, మహేశ్‌కు ఒంటరిగా ఉన్న మల్లికార్జున్ కనిపించాడు. ఒక్కసారిగా మల్లికార్జున్‌పై పడి కత్తితో గొంతుపై, పొట్టలో పొడిచి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. మృతుడి తల్లి లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మృతుడి తల్లి నుంచి కొంత సమాచారం సేకరించారు. 19న ఓ వ్యక్తి వచ్చి తన కుమారుడిని బైక్‌పై తీసుకువెళ్లిట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసుల దర్యాప్తులో మల్లికార్జున్‌ను ఆ రోజు అజయ్ తీసుకెళ్లినట్టు గుర్తించారు.
అజయ్ నుంచి సేకరించిన ఆధారాలు, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్‌తో పోలీసులు నిందితులను గుర్తించి, గురువారం ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మల్లికార్జున్ హత్యలో అజయ్ పాత్ర ఏమీ లేదని పోలీసులు తెలిపారు. మల్లికార్జున్‌తో తమకు ప్రాణహాని ఉండటం వల్లే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల నుంచి కారు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురామ్, ఎస్సైలు శ్రీనివాస్, మధు పాల్గొన్నారు.