కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 25: పెళ్లి చేసుకుని 20 ఏళ్లు అయ్యింది. పిల్లలు పుట్టడం లేదు. దీంతో తీవ్ర మానసిక వేదన చెందుతూ బాధపడుతున్న ఓ వ్యక్తి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే బాలుడిని..తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ మంగళవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కలివల గీత, రాధే కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. సనత్‌నగర్‌లోని ఫతేనగర్ శివాలయం రోడ్డులో వీధి పక్కనే ఉంటూ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి 8 ఏండ్ల వయసున్న కుమారుడితో పాటు 8 నెలల వయసున్న శివం అనే పసిపాప కూడా ఉన్నారు. కాగా శనివారం (ఈనెల 22న) ఫతేనగర్ శివాలయం రోడ్డు వద్ద విపిన్ ఇండస్ట్రీస్ షట్టర్ ముందు రోడ్డు ఫుట్‌పాత్ పక్కన తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి పడుకున్నారు. అదే రోజు రాత్రి 2.30 గంటలకు పసిబాలుడు శివం అపహరణకు గురయ్యాడు. మరుసటి రోజు ఆదివారం ఫిర్యాదు అందుకున్న సనత్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
బీహార్ రాష్ట్రం చాప్ర జిల్లాకు చెందిన సత్యనారాయణ రామ్ (43), మరో నిందితుడు సన్నికుమార్ పాండే (24)లను పోలీసులు నిందితులుగా గుర్తించారు. సత్యనారాయణ రామ్ తనకు పళ్లు 20 ఏండ్లు కావస్తున్నదని ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు కాకపోవడంతో..తాను వచ్చిపోయే మార్గంలో పసిబాలుడిని గమనించి ఎత్తుకెళ్లానని విచారణలో ఒప్పుకున్నాడు. అపహరించే సమయంలో పసివాడు ఏడవకుండా ఉండేందుకు పాలడబ్బా ఇచ్చానని చెప్పాడు. కాగా పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకొని నిందితుడు ఇక్కడి నుండి పరారయ్యే క్రమంలో బాలుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. సురక్షితంగా బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలోబాలనగర్ ఏసీపీ హనుమంతరావు, సనత్ నగర్ సీఐ శ్రీనివాసులు తో పాటు కానిస్టేబుల్, సీసీఎస్ పోలీసులు ఉన్నారు.