Hyderabad | బంజారాహిల్స్, మే 21: న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ కోసం అనేకసార్లు చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేకుండా చూసేందుకు ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ అందించేలా చూడాలని వెస్ట్‌జోన్ డీసీపీ ఆదేశించారు. దీంతో ఇటీవల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ పోలీసులు వారంరోజులుగా నమోదైన ప్రతి ఎఫ్ఐఆర్ను ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు.
బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఫిర్యాదు చేసిన వెంటనే కాగ్నిజబుల్ నేరం అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, కాపీని అతడికి అందజేయడం తప్పనిసరి చేసింది. అయితే పని ఒత్తిడితో చాలావరకు ఆచరణలో సాధ్యం కావడం లేదు. అయితే ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు పోలీసు వ్యవస్థపై మరింత విశ్వాసం పెంచేలా చూడడం అందరి బాధ్యత అన్నారు. ఇందులో భాగంగా నిబంధనల మేరకు నేరుగా ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీ అందించడంతో ఎలాంటి అలసత్వం వహించరాదని ఆదేశించారు.
డీసీపీ ఆదేశాల మేరకు వెస్ట్‌జోన్ పరిధిలో నమోదవుతున్న అన్ని కేసులకు చెందిన ఎఫ్ఐఆర్లను నేరుగా ఇంటికి ఇవ్వడం కానీ, వేరే ప్రాంతంలో ఫిర్యాదుదారుడు నివాసం ఉంటే వాట్సాప్ ద్వారా ఎఫ్ఐఆర్ పంపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలతో పాటు తీవ్రమైన నేరాలలో బాధితులు ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత మళ్లీ పీఎస్‌కు రావడం ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్లు ఇంటికి పంపిస్తున్నామని ఫిలింనగర్ ఎస్‌హెచ్‌వో సంతోషం తెలిపారు. సున్నితమైన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు మఫ్టీలో వెళ్లి అందజేస్తామని వివరించారు. దీనివల్ల ఫిర్యాదుదారులకు ఊరట కలగడంతో పాటు వేగంగా దర్యాప్తు ప్రక్రియను చేపట్టే అవకాశం సైతం ఉందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.