Hyderabad | జగద్గిరిగుట్ట/దుండిగల్ మార్చి 12 : అక్రమ వారసత్వ హక్కు ముసుగులో జరిగిన భూ కుంభకోణం రెవెన్యూ అధికారుల మెడకు చుట్టుకుంది. కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో రెహమాన్‌పై విచారణ కొనసాగిస్తున్నారు.
కుత్బుల్లాపూర్ రెవెన్యూ పరిధి గాజులరామారం డివిజన్ లాల్ సాబ్ గుడా సర్వే నెంబర్లు 402, 403, 422లో సుధాకర్ అనే వ్యక్తికి 5.2 ఎకరాల భూమి ఉంది. అతను ఐదేళ్ల కిందట, అతని భార్య అంతకుముందే చనిపోయారు. వారసత్వ హక్కు పేరుతో కర్నూల్‌కు చెందిన సుధాకర్ సోదరుడి కుమారుడు రెవెన్యూ అధికారులను సంప్రదించి ఆస్తి బదలాయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తప్పుడు పత్రాలతో మార్పిడి జరిగిందని సుధాకర్ భార్య తరుపు బంధువులు కోర్టును ఆశ్రయించారు. సుధాకర్ హైదరాబాదులో చనిపోగా కర్నూల్లో చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. రెండు నెలల కిందట ఎమ్మార్వో పాత్రపై జగద్గిరిగుట్టలో, ఆస్తి పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఏ పత్రాలు, వివరాలు అధారంగా భూమార్పిడి జరిగిందో విచారణ ప్రారంభించిన జగద్గిరిగుట్ట పోలీసులకు ఎమ్మార్వో రెహమాన్ అందుబాటులోకి రాలేదు. రెండు నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు మేరకు పోలీసులు, రెవెన్యూ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణ చేస్తున్నట్లు జగద్గిరిగుట్ట సీఐ నరసింహ తెలిపారు.