ఖైరతాబాద్, జనవరి 21: ఆడ పిల్లలకు అండగా నిలుద్దామంటూ.. వారి విద్య, సాధికారత కోసం చైల్డ్ రైట్స్ అండ్ యూ (క్రై) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ స్టేషన్ వద్ద ‘ఎంపవర్ హర్’ పేరుతో ఆదివారం వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్‌ను షీటీమ్స్ ఏడీజీపీ షిఖా గోయెల్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్స్ డిజైనర్ శ్రావ్య వర్మ, క్రై సౌత్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్, తెలంగాణ, ఏపీ హెడ్ చెన్నయ్య, మేనేజర్ డాక్టర్ సన్నాకి మున్న కలిసి ప్రారంభించారు. షిఖా గోయెల్ మాట్లాడుతూ.. ఆడపిల్లల రక్షణ, సాధికారత కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలో స్త్రీల రక్షణ కోసం పోలీసు శాఖ పకడ్బందీగా పనిచేస్తున్నదని, షీటీమ్స్ అండగా నిలుస్తున్నదన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాల నిర్వహణను సుప్రీం కోర్టు అభినందించిందని పేర్కొన్నారు. గృహహింస బాధితుల కోసం 278 కేంద్రాలను ఏర్పాటు చేశామని, పనిచేసే చోట జరిగే లైంగిక వేధింపులను అరికట్టేందుకు సాహస్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. సైబర్‌క్రైమ్‌పై సుమారు పది వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చి వారిని అంబాసిడర్‌గా తయారు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రసన్న లక్ష్మి, ఇన్స్పెక్టర్లు ధనలక్ష్మి, శేఖర్ రెడ్డి, క్రై ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.