సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): చైనా సైబర్‌నేరగాళ్ల ఆదేశాల మేరకు పనిచేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కిన పార్ట్‌టైం జాబ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ నేరగాళ్ల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. వారం రోజుల కిందట హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌ను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ వెనుక చైనా సైబర్‌నేరగాళ్లు ఉండి, భారతదేశంలో ప్రకాశ్ ప్రజాపతి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అమాయకులకు పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో ఎరవేసి, వారి ద్వారా ఆయా ఖాతాల్లో డబ్బు డిపాజిట్లు చేయించి, ఆ డబ్బును క్రిప్టో ద్వారా విదేశాలకు తరలించారు. ఈ సైబర్ ముఠాకు ఉగ్ర లింకులు కూడా ఉన్నాయన్న విషయం బయటపడింది. ఈ కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించేందుకు న్యాయస్థానం వారం రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో నిందితులను సైబర్‌క్రైమ్ పోలీసులు విచారించారు. నిందితులను మొదటి రోజు ఎన్ఐఏ కూడా విచారించింది. నిందితుల విచారణలో పోలీసులకు పలు కొత్త విషయాలు కూడా తెలిశాయి. దేశంలో కమీషన్ పద్ధతిలో బ్యాంకు ఖాతాలు తెరిచి, నేరగాళ్లకు అప్పగించే ఇతర ముఠాల విషయం కూడా బయటకు వచ్చింది. ఈ ముఠాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులిచ్చిన సమాచారంతో వారి నెట్‌వర్క్‌ను ఇప్పుడు సైబర్‌క్రైమ్ పోలీసులు ఛేదించే పనిలో పడ్డారు.