సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా, ఐడీఏ బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కట్టుకున్న భర్తనే ప్రధాన సూత్రధారిగా తేలగా, బిహార్‌కు చెందిన సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో హతురాలి భర్త అనిల్‌కుమార్ సాహ్తోపాటు గ్యాంగ్ సభ్యుడు రంజన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో శేరీలింగంపల్లి డీసీపీ సిహెచ్. శ్రీనివాస్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. గండిగూడెం గ్రామ శివారులో మే 30వ తేదీ రాత్రి మీనాదేవి (36) హత్యకు గురైంది. ఈ ఘటనపై హతురాలి భర్త అనిల్ కుమార్‌సాహ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము కూరగాయల మారెట్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా మీటర్ ఫ్యాక్టరీ సమీపంలో బైక్ ఆగిపోయిందని, ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు పొదల్లో నుంచి వచ్చి తన భార్యను బలవంతంగా తీసుకెళ్లి, ఆమె గొంతు కోసి హత్య చేశారని, తనపై కూడా దాడి చేసి బైక్‌ను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు అధికారులు, ఆర్సీపురం డివిజన్ పోలీసులు, ఎస్వోటీ బృందాలతో కలిసి ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, అనుమానితుల కదలికలను విశ్లేషించారు.
భర్తే ప్రధాన సూత్రదారి
ఈ కేసులో మహిళ హత్యకు ఆమె భర్తనే ప్రధాన సూత్రదారిగా పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో హతురాలి భర్త అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన సంపాదన మొత్తం తన భార్య మీనా దేవి తరచూ తన తల్లిదండ్రులకు పంపుతుందని, గత మూడేళ్లుగా ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని వెల్లడించాడు. అంతేగాక ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడి, శారీరకంగా బలహీనపడిన తనను తన భార్య పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందనే భావనతో ఆమెపై కక్ష గట్టి ఎలాగైన చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తనకు పరిచయమున్న బిహార్‌కు చెందిన కిరాయి హంతకుడు రింకుకుమార్ను సంప్రదించి, రూ.2 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రింకు కుమార్ తన సహచరులు రంజన్, నీరజ్‌లను వెంట తీసుకుని మే 29న హైదరాబాద్‌కు వచ్చాడు. అనిల్‌తో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించి, 30న హత్య చేశారు. ఇందులో కీలక నిందితుడైన రంజన్‌ను బిహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లా, బేత్తియా సమీపంలోని చన్ పాటియా గ్రామంలో అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రధాన నిందితుడు రింకుకుమార్, మరో నిందితుడు నీరజ్ పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. రింకు కుమార్, నీరజ్లపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి అభినందించారు.