Heavy Rains | సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు సుధీర్ బాబు, అవినాశ్ మహంతి సూచించారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చేపట్టిన సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇద్దరు సీపీలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు, ఏర్పాట్లు, ప్రమాదాలను నివారించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జోనల్ డీసీపీలు, ఏసీపీలు ఇతర అధికారులకు సూచనలు చేశారు. ఆయా శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లకుండా కట్టడి చేయాలని, రోడ్లన్నీ జలమయం కావడంతో మ్యాన్ హోల్స్‌ను తెరవొద్దని, ఒక వేళ తెరిచినా అక్కడ సూచిక బోర్డును తప్పని సరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాచకొండ ఎస్బీ డీసీపీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.