సిటీబ్యూరో, జనవరి 8(నమస్తే తెలంగాణ): ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్లు తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ పతకాలు సాధించి రాచకొండ కమిషనరేట్‌కు మంచిపేరు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆకాంక్షించారు. వియత్నంలో గత ఏడాది డిసెంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు జరిగిన 2024 ఆసియా ఓపెన్ పోలీస్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సంజీవ్‌కుమార్ అండర్-34 కేటగిరిలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.
ఈ పోటీల్లో సుమారు 30 దేశాల నుంచి 2500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాంస్య పతకం పొందిన సంజీవ్‌కుమార్ బుధవారం నేరెడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబును కలిశాడు. ఈ సందర్భంగా సీపీ సంజీవ్‌కుమార్‌ను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.