సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకుంటూ.. బక్రీద్‌ను ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు పోలీసులకు అందరూ పూర్తి సహకారాన్ని అందించాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లు, బందోబస్తుకు సంబంధించిన వివిధ అంశాలుపై చర్చించడంలో భాగంగా గురువారం సాలార్ జంగ్ మ్యూజియంలో పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి తదితర శాఖలు, రాజకీయ పార్టీ నాయకులు, మతపెద్దలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలితో పాటు నగర అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, కార్ హెడ్‌క్వార్టర్స్ అదనపు సీపీ సత్యానారాయణ తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలన్నారు. చట్టాన్ని ఎవరూ కూడా తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. పటిష్టమైన బందోబస్తు ఉన్నదని, ప్రశాంతమైన వాతావారణంలో బక్రీద్‌ను నిర్వహించుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్క్స్ శాఖలు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని కోరారు.