సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ): స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించడానికి కారణంగా చూపిస్తూ 13 మందిని నిందితులుగా చేర్చారు. 2023 మార్చి 16న సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనలో క్యూనెట్కు చెందిన ఆఫీసు పూర్తిగా దగ్ధమవ్వగా, చనిపోయిన వారంతా క్యూనెట్‌లో పనిచేస్తున్నవారేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు కారణంగా చూపిస్తూ 13మందిపేర్లను చార్జిషీట్లో చేర్చినట్లు తెలిసింది. క్యూనెట్కు చెందిన ఇద్దరితో పాటు, స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డర్లు, అసోసియేషన్‌కు చెందిన వ్యక్తులను నిందితులుగా పోలీసులు చేర్చారు. ఫైర్ సేఫ్టీని గాలికి వదిలేసిన స్వప్నలోక్ బిల్డర్లే ప్రధాన నిందితులుగా పోలీసులు తెలిపారు. ఎగ్జిట్ పాయింట్ వద్ద వేస్ట్ మెటీరియల్ డంప్ చేయడం వల్లే ఆరుగురు తమ ప్రాణాలను రక్షించుకోలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు.