సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్‌కు చెందిన దంపతులు సంతానలేమితో బాధపడుతూ టెక్నాలజీని నమ్ముకుని సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. వారు చెప్పిన మాటకల్లా తలూపారు. చివరికి రూ.30 లక్షలు డీల్ కుదిరింది. సరోగసీతో బిడ్డను పుట్టించి ఇచ్చారు. రెండేండ్ల తర్వాత ఆ బిడ్డ అనారోగ్యం చూసి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే అది తమ బిడ్డ కాదని తెలిసి ఫర్టిలిటీ సెంటర్‌కు వచ్చారు. తమకు బిడ్డ వద్దంటూ వదిలేసి వెళ్లిపోయారు.
ఇప్పుడా బిడ్డ అనాథగా మిగిలాడు. తల్లిదండ్రులు తాము డబ్బులు పోగొట్టుకుని, సంతానం కోసం చూసిన ఎదురుచూపులు ఫలించక కన్నీరుమున్నీరవుతున్న పరిస్థితులు వర్ణనాతీతం. ఆ దంపతులది అంతులేని దైన్యం.. ఆ బిడ్డది అనాథ జీవితం. తల్లిదండ్రులుండీ అనాథగా మారిన ఆ పసిబిడ్డ ఆలనాపాలనా చూసేదెవరు..? ఇప్పుడు శిశువిహార్‌కు ఆ బిడ్డను తరలించినా తల్లిదండ్రుల లాలనాపాలనా దొరుకుతుందా.. ? ఇంతటి పరిస్థితికి కారణమెవరు. అక్రమ సరోగసీ మాయాజాలంలో ఇదొక మచ్చుతునక మాత్రమే.
ఎవరిబిడ్డనో తీసుకొచ్చి..
ఎవరిబిడ్డనో తీసుకొచ్చి మీ బిడ్డ అంటూ నమ్మించి వారి కలలకు జీవం పోసి తిరిగి వాటికే రూపం లేకుండా చేస్తున్న ఫర్టిలిటీ మోసాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న దంపతుల అండం, వీర్యం సేకరించి సరోగసీ ద్వారా వారికి సంతానం కలిగిస్తామని మాటలు చెప్పి నమ్మిస్తున్నారు. నవమాసాల తర్వాత ఒక శిశువును తెచ్చిచ్చి వీరు మీ పిల్లలే అంటూ నమ్మించి డబ్బులు దండుకుంటున్నారు.
ఆ తర్వాత డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే వారు తమ పిల్లలు కాదని తెలియడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. సృష్టి వ్యవహారంతో ఈ తరహా కేసులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మొదట సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత.. ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మీ రెడ్డి కేసు. ఈమె ఇదే తరహా అక్రమ సరోగసీతో పిల్లలను కనిచ్చేందుకు ఓ రేటు కుదుర్చుకుంటుంది. ఆ తర్వాత అక్రమ సరోగసీతో జన్మించిన ఆ బిడ్డలను మీ పిల్లలే అంటూ దంపతులకు అప్పగించిన తర్వాత కొన్ని రోజులకు తీరా వారు తమ పిల్లలు కాదని తెలిసి ఇబ్బంది పడుతున్నారు.
ఆ పిల్లలను కొందరేమో తమకు వద్దంటూ తీసుకొచ్చి వదిలేస్తుంటే మరికొందరు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. పోలీసుల విచారణలో బయటపడుతున్న ఈ నిజాలు అమ్మతనాన్నే అపహాస్యం చేస్తున్నాయి. ఏజెంట్ల ద్వారా తమ అక్రమార్జనకు సరోగసీని అడ్డం పెట్టుకుని పలు రాష్ర్టాల్లో పేద వారిని అందునా డబ్బులు అవసరమున్న మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ఫర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు ఈ దందా కొనసాగించారు.
మరికొందరు ఆశావర్కర్లు, అంగన్వాడీల ద్వారా అబార్షన్‌కు వెళ్లే మహిళలను ట్రాప్ చేసి వారికి డబ్బులు ఆశ చూపి వారు కనే పిల్లలను వేరే వారికి అప్పగించడం ద్వారా తమ ప్రయోజనం నెరవేర్చుకున్నారు. తీరా బండారం బయటపడ్డాక తమ పిల్లలు కాదని తెలిస్తే ఆ తల్లిదండ్రులు, ఆ శిశువుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఈ రెండు కేసుల్లో సుమారుగా 130 మంది శిశువులకు సంబంధించిన వ్యవహారంపై నిగ్గు తేల్చాల్సి ఉంది.
వారి అసలు తల్లిదండ్రులెవరు? సరోగసీ కోసం ఈ మాయలేడీలు చేసిన వ్యవహారంలో బలిపశువులుగా మారిన దంపతులెవరు..? శిశువులు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నారు ..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలను శిశు విహార్‌కు పంపించామని, మరికొందరి విషయంలో తల్లిదండ్రులు ఏ క్లారిటీ ఇవ్వడం లేదని పోలీసులు చెప్పారు. ఇది పెద్ద నెట్వర్క్ అని, ఈ నెట్‌వర్క్‌లో ఏజెంట్ల పాత్ర చాలా ముఖ్యమని, వీరు ఒక్క సెంటర్‌కు కాకుండా అనేక ఫర్టిలిటీ సెంటర్లకు పనిచేస్తున్నారని తాము గుర్తించినట్లు వారు పేర్కొన్నారు.
ఈ పాపానికి బాధ్యులెవరు..!
ఇన్నాళ్లూ గుండెను హత్తుకుని పెంచిన కన్నపేగు తనది కాదని, ఆ కలల పంట తమ రక్తం కాదని తెలిసిన వెంటనే ఆ దంపతుల హృదయం తల్లడిల్లిపోయింది. సృష్టి సృష్టించిన అరాచకాలకు ఒక తల్లి అమ్మ అన్న పిలుపునకు దూరమైంది. మరో తల్లి కటకటాల పాలై బిడ్డను దూరం చేసుకుంది. ఇవేమీ తెలియని ఓ పసికందు నాలుగు గోడల మధ్యే ఏం జరిగిందో తెలియక ఏం జరుగుతుందో అర్థం కాక అనాథగా బతుకుతోంది.
ఇన్ని అనర్థాలకు మూలం సరోగసీ అక్రమాలే. సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి సెంటర్ దారుణాలు వెలుగుచూస్తున్న సమయంలోనే మేడ్చల్ జిల్లాలో అక్రమ సరోగసీ వ్యవహారం వెలుగుచూసింది. కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పేదింటి యువతులకు గాలం వేసి వారిని సరోగసీ, అండాల దానానికి ఒప్పించి అందుకు ఖరీదు కట్టి జోరుగా దందా సాగిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలు గతంలో సరోగసీ మదర్‌గా, ఎగ్డోనార్గా పనిచేసిందని పోలీసులు చెబుతున్నారు.
తన బ్యాంక్ బాలెన్స్ నింపుకోవడానికి తాము కూడా మహిళలే అన్న విషయం మరిచిపోయి డబ్బుల కోసం ఇంతటి దారుణాలకు ఒడిగట్టిన నమ్రత, లక్ష్మి వంటి వారి అరాచకాలను చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది. సరోగసీ పేరుతో దంపతుల వీర్యం, అండం సేకరించి ఆ తర్వాత వారి దగ్గర నుంచి డబ్బులు లాగడమే కాకుండా వారి బిడ్డే అంటూ వేరొకరి బిడ్డను అప్పగించి తిరిగి ఏదైనా సమస్య రాగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు బాధితులు పోలీసుల ముందు వాపోయారు.
అయితే తమ బిడ్డలు కానివారిని ఎలా పెంచుకోవాలంటూ కొందరు అన్యమనస్కంగానే ఆ పిల్లలను తీసుకెళ్లగా కొందరేమో ఈ పోలీసులతో ఎందుకు పంచాయితీ ఫోన్లే ఎత్తడం లేదని తెలిసింది. కని వదిలేసిన తల్లులకు మమకారం మాటేమో కానీ.. పెంచుకున్న మమకారం ఈ అక్రమ సరోగసీ పేరుతో అపహాస్యం పాలైందనే చెప్పాలి. కేవలం డబ్బుల మాటున చేసిన దందాలో తమ కలలన్నీ కల్లలయ్యాయని బాధపడుతూ పిల్లలను వదిలేయడానికి కొందరు నిర్ణయించుకున్నారని, కొందరేమో తమకు తెలియకుండానే అనాథాశ్రమాల్లో చేరుస్తున్నారని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
ఏజెంట్లే కీలకం..!
ముఖ్యంగా అక్రమ సరోగసీ కేసుల్లో వివిధ రాష్ర్టాల్లోని ఏజెంట్లే కీలకమని, వీరి ద్వారానే శిశువుల క్రయవిక్రయాలు, సరోగసీ మదర్ ఎంపికలు జరిగేవని పోలీసులు చెప్పారు. సరోగసీ పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను కొనుగోలు చేశామని, అందరికీ డబ్బులు ఇచ్చి కొన్నట్లు నమ్రత తెలిపారు. మరోవైపు అక్రమ సరోగసీ, చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో ఏజెంట్ల వివరాలపై ఆరా తీశారు. గతంలో సరోగసీ, ఎగ్డోనార్గా పనిచేసినవారు, ల్యాబ్ టెక్నిషియన్లు, అంగన్వాడీలు .. ఇలా చాలా మంది ఏజెంట్లుగా పనిచేశారు. లక్ష్మీరెడ్డి గతంలో ఎగ్డోనార్, సరోగసీ మదర్‌గా పనిచేశారు.
అక్కడి నుంచే ఆమెకు సరోగసీ పేరుతో డబ్బులు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుని ఆ తర్వాత ఆమె స్వయంగా ఈ ఏజెన్సీ స్టార్ట్ చేశారు. తన దగ్గర ఉన్న సంబంధాలతో పేద యువతులకు గాలం వేసి వారిని ఎగ్ డోనార్‌గా పనిచేయించారు. వారికి మూడుసార్లు అండాలు ఇస్తే రూ. 30 వేలు, సరోగసీ ద్వారా పిల్లలను కనిస్తే రూ.4 లక్షలు ఆశ చూపింది. అంతేకాకుండా తన ఇంటిపైన ఉన్న రూమ్‌లను కేవలం బ్యాచ్‌లర్స్‌కు అద్దెకి ఇచ్చి వారి నుంచి వీర్యం సేకరించారు. ఇప్పటివరకు లక్ష్మి 50 మంది మహిళలతో సరోగసీ చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.
తల్లీ కొడుకులే సూత్రధారులు..!
అక్రమ సరోగసీ, చైల్డ్ ట్రాఫికింగ్‌కు సంబంధించి వెలుగుచూసిన ఈ రెండు కేసుల్లోనూ తల్లికొడుకులే కీలక సూత్రధారులుగా పోలీసులు చెప్పారు. సృష్టి కేసులో డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కొడుకు జయంత్‌కృష్ణ ప్రధాన నిందితులుగా ఉండగా, మేడ్చల్ సరోగసీ వ్యవహారంలో నర్రెద్దుల లక్ష్మీరెడ్డి, ఆమె కొడుకు నరేందర్‌రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. సరోగసీ కేసులో అక్రమంగా గర్భధారణ చేసే వారికి మూడు నుంచి నాలుగు లక్షలు ఇచ్చేవారని, బాధితుల నుంచి రూ.25 నుంచి రూ.50లక్షల వరకు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు.
ప్రతీ ఒక్క కేసులో సరోగెంట్ తల్లుల చేత ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం, బాధితుల నుంచి కూడా బాండ్స్ తీసుకోవడం ఇరువురూ సమానంగా చేసేవారు. లక్ష్మి మొత్తం వ్యవహారంలో కీలకంగా తెలుస్తోంది. ఈమెకు హెగ్డే హాస్పిటల్‌తో పాటు, అనుటెస్ట్ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ఐవీఫ్, ఫర్టికేర్, శ్రీఫెర్టిలిటి, అమూల్యఫెర్టిలిటీలతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. ఇందులో కొన్ని సృష్టితో లింక్ అయి ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సృష్టి వ్యవహారంలో లక్ష్మికి సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
ఇందులో మరో కోణం..వన్‌ప్లన్ వన్ ఆఫర్. సరోగసీ ద్వారా బిడ్డను ఇస్తాం. పెంచుకోండి.. తర్వాత ఆ బిడ్డ మీది కాదని తేలితే మరో బిడ్డను అందిస్తాం.. అంటూ అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశారు. అమాయక దంపతుల ఆశలను అడ్డుపెట్టుకుని, అక్రమంగా శిశు విక్రయాలకు పాల్పడినట్లు బయటపడింది తెలుగురాష్ర్టాల్లోనే కాదు.. ఇతర రాష్ర్టాల్లోనూ ఈ తరహా బాధితులు వేల సంఖ్యలోనే ఉంటారని పోలీసులు అంచనావేస్తున్నారు. ఏజెంట్ల నెట్వర్క్ బలంగా ఉన్న కారణంగా ఈ శిశు విక్రయాలపై లోతైన విచారణ జరగాల్సి ఉంటుందని ఓ సీనియర్ పోలీస్ అధికారి అభిప్రాయపడ్డారు.