Balkampet Temple | సిటీబ్యూరో: ‘మాకు తగిలిన దెబ్బలకు కలకల తగిలి.. గవర్నమెంట్ నాశనమై పోతదంటూ.. శాపనార్థాలు పెట్టారు పోతరాజులు, శివసత్తులు, జోగినీలు. ‘పోతరాజులను గల్లపట్టారు.. శివసత్తులను గుర్తించకుండా లాగేశారు.. ఎస్సై ఎవరో.. సీఐ ఎవరో ఇష్టానుసారంగా ప్రజలపై లాఠీచార్జీ చేశారు. ఎవరినీ పడితే వాళ్లను జీపులో కూర్చోబెట్టి..దౌర్జన్యం చేశారు.. అమ్మవారి ఊరేగింపులో భక్తులు పాల్గొనకుండా పోలీసులు కట్టడి చేశార’ంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అనంతరం గురువారం నిర్వహించిన రథోత్సవంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎవరిపై పడితే వారిపై లాఠీలు ఝళిపించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భక్తులు.. ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన కల్యాణం, రథోత్సవాల్లో ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు.
కాగా, పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించారు..? వేడుకలు జరగకుండా భక్తులపై ఎందుకు లాఠీలు ఝళిపించారు..? అన్న విషయాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వేడుకలు వైభవంగా జరగకుండా కట్టడి చేశారనే ఆరోపణలు వినిపిస్తుండగా, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే కిందిస్థాయిలో ఉండే వారు రెచ్చిపోయారని కొందరు ఆరోపిస్తున్నారు. కాగా, కల్యాణోత్సవానికి హాజరైన మంత్రికే చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళా జర్నలిస్టులపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వేడుకలు సరిగ్గా జరగకుండా ఉండేందుకు కుట్ర జరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత గురువారం రథోత్సవంలో పోలీసులు వీరంగం సృష్టించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది తెలియాల్సి ఉంది.