సిటీబ్యూరో/చార్మినార్, మే 27(నమస్తే తెలంగాణ): కేజీలకు కేజీలు బంగారం తెచ్చారు… అంతా జీరోబిల్లులే… పట్టుకున్నాం కదా.. మరి మాకేంటి… మీ బంగారం మీకు కావాలంటే రూ.25లక్షలు ఇవ్వండి… లేకుంటే పైకి చెప్తాం.. సీజ్ చేస్తాం… ఇది పోలీసుల బెదిరింపు. నాంపల్లి వద్ద సోమవారం సాయంత్రం పట్టుకున్న 20కిలోల బంగారంపై పోలీసులు సదరు మధ్యవర్తితో బేరాలు సాగిస్తున్నట్లు సమాచారం.
చార్మినార్ పరిసరప్రాంతాల నుంచి నాంపల్లి మీదుగా తీసుకెళ్తున్న బంగారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇంత బంగారం ఉందా అని వారే ఆశ్చర్యపోయారు. ఈ బంగారాన్ని ముంబైకి చెందిన ఓ వ్యాపారికి జీరోబిల్లులో ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకోవడంతో మధ్యవర్తి లబోదిబోమన్నాడు. బంగారం వదిలేస్తే అడిగినంత ఇస్తాననడంతో పోలీసులు రూ.25లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచా రం. అయితే ఆ మధ్యవర్తి తాను రూ.15లక్షల వరకు ఇస్తానని చెప్పినా.. భారీ మొత్తంలో పట్టుకున్నాం.. పోతే పెద్దగానే పోతుంది… 25 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారని తెలిసింది.
బంగారం ఏ వ్యాపారి దగ్గరనుంచైతే తెస్తున్నారో అతను మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. తాను బంగారం మధ్యవర్తితో పంపానని అతనిదే బాధ్యత అంటూ పక్కకు తప్పుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయంలో పోలీసులు సదరు వ్యాపారిని సంప్రదిస్తే నాకేం తెలియదని బుకాయించాడట. టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న బంగారం విషయంలో ముంబై వ్యాపారి కూడా మరో రెండురోజులు చూసి వెనక్కు వెళ్లిపోతానని మధ్యవర్తిపై ఒత్తిడి తెస్తున్నాడని తెలిసింది.
దీంతో అటు అసలు వ్యాపారి, ఇటు ముంబై వ్యాపారిని సమన్వయం చేసుకుంటూ పోలీసులకు అడిగినంత ఇచ్చుకుని బయటపడడానికి మధ్యవర్తి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసిందా లేదా అనేది మాత్రం ప్రస్తు తం సస్పెన్స్‌గానే మిగిలింది. బేరం కుదిరి డబ్బులు వస్తే గప్‌చుప్‌గా క్లోజ్ చేయాలని, లేదంటే పట్టుకున్న బంగారం బయటకు చెప్పి రివార్డులైనా మిగుల్చుకోవాలని ఖాకీలు చర్చిస్తున్నారట. మరి ఈ వ్యవహారంపై నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఎలా స్పందిస్తారో చూడాలి.