సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ): బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. శుక్రవారం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బక్రీద్ బందోబస్తును పర్యవేక్షించారు. చెక్‌పోస్టుల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. జియాగూడ గోశాల, ఎంజెబ్రిడ్జ్ చెక్‌పోస్ట్, హసన్ నగర్ చెక్‌పోస్ట్, బండ్లగూడ చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడిన కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బక్రీద్ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేలా చూడాలని ప్రజలను కోరిన సీపీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నగరంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. మీరాలం ట్యాంక్ ఈద్గా దగ్గర ఉదయం 7గంటల నుంచి 11:30 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. పురానాపూల్, కామటిపుర, కిషన్‌బాగ్ నుంచి మీరాలం ఈద్గా వైపు వచ్చే ప్రార్థన చేసుకోవడానికి వచ్చే వాహదారులను బహదూర్‌పుర క్రాస్ రోడ్స్ మీదుగా అనుమతించిన జనరల్ వాహనదారులను మన్మోహన్సింగ్ ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తామని తెలిపారు.
శివరాంపల్లి, దానమ్మ గుడిసెల మీదుగా ప్రార్థనల కోసం వచ్చే వారిని దానమ్మహట్స్ క్రాస్‌రోడ్స్ మీదుగా శాస్తిపురం, ఎన్ఎస్కుంట వైపు మళ్లిస్తారు. కాలాపత్తర్ నుంచి ఈద్గావైపుకు వచ్చే వారిని కాలాపత్తర్ ఎల్ అండ్ ఓ పీఎస్ మీదుగా పంపుతారని,మోచి కాలనీ, బహదూర్‌పుర, శంషీర్‌గంజ్, నవాబ్‌సాహెబ్ కుంట మీదుగా మళ్లిస్తారని తెలిపారు. పురానాపూల్ నుంచి బహదూర్‌పుర వైపు వెళ్లే వాహనాలను జియాగూడ, సిటీకాలేజ్ మీదుగా మళ్లిస్తామని, శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పుర వైపు వచ్చే హెవీ వాహనాలను మన్మోహన్సింగ్ై ఫ్లెఓవర్ మీదుగా మళ్లిస్తామని జోయల్‌డేవిస్ తెలిపారు.