BRS Party | మన్సురాబాద్, మార్చి 17 : మన్సురాబాద్ డివిజన్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 12న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీ, వీరన్న గుట్ట, విజయనగర్ కాలనీల్లో రూ.71 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సదరు పనుల శంకుస్థాపనల విషయంలో ఎమ్మెల్యే ప్రోటోకాల్ విస్మరించాడని.. కాలనీవాసులకు సమాచారం ఇచ్చిన తర్వాత తనకు తెలియజేశారని… ప్రోటోకాల్ నిబంధనలు పాటించనందున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన శంకుస్థాపనలకు తాను తిరిగి శంకుస్థాపనలు చేస్తానని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సోమవారం ఉదయం సరస్వతి నగర్ కాలనీకి చేరుకున్నారు.
విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గులాబీ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపనలు చేసిన పనులకు తిరిగి కార్పొరేటర్ రెండోసారి ఎలా శంకుస్థాపనలు చేస్తారని ప్రశ్నించేందుకు బిఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమయ్యారు. కార్పొరేటర్‌ను ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతుండగా అప్పటికే సరస్వతి నగర్ కాలనీకి చేరుకున్న ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్ తదితరులు బిఆర్ఎస్ నాయకులను అడ్డుకొని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బిజెపి నాయకులు ఒకరిపై మరొకరు నినాదాలు చేసుకుంటూ అక్కడి నుంచి వీరన్న గుట్టకు తరలి వెళ్లారు.
సరస్వతి నగర్ కాలనీ నుంచి వీరన్న గుట్టకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులను హయత్ నగర్, వనస్థలిపురం సిఐలు అడ్డుకున్నారు. శంకుస్థాపన విషయంలో కార్పొరేటర్ సమాధానం చెప్పినాకే తాము ఇక్కడి నుంచి కదులుతామంటూ బిఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి తదితరులు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. బీఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు ఈడ్చుకొని లాక్కెళ్ళి పోలీసు వ్యాన్లలో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అసభ్యకరమైన పదజాలంతో పోలీసులు తనను దూషించారని జక్కిడి రఘువీర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు బిజెపి కార్పొరేటర్‌కు వత్తాసు పలుకుతూ తమతో దురుసుగా వ్యవహరించారని.. పోలీసులు బిజెపికి ఏజెంట్లుగా మారిపోయారంటూ బిఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసులతో జరిగిన తోపులాటలో బిఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డితో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో బిఆర్ఎస్ నాయకుడు రఘువీర్ రెడ్డి బట్టలు చినిగిపోయాయి. శంకుస్థాపనల విషయంలో ప్రశ్నించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై కాలనీలవాసులు విస్మయం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి కుమ్ముకు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది.