Kalpana | విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నేపాలీ పనిమనిషి కల్పన అలియాజ్ ధర్మ(30)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని పుణెలో ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నేపాలీ గ్యాంగ్ కోసం హైదరబాద్, పుణె, ముంబై, ఢిల్లీ, బిహార్‌కు ప్రత్యేక బృందాలను పంపించారు. అలాగే నిందితులు సరిహద్దు దాటి నేపాల్‌కు వెళ్లకుండా జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కల్పన పుణేలో ఉన్నట్లు వారు పోలీసులకుతెలిపారు. దీంతో ప్రత్యేక బృందాలు పుణేకి వెళ్లి.. కల్పనను పట్టుకున్నారు.
ఇక నిందితులను నేపాల్‌లోని సాహూ గ్యాంగ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ జైలు నుంచే ఈ దోపిడీని సాహూ గ్యాంగ్ ప్లాన్ చేసిందని సమాచారం. ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులను అటాచ్ చేసి ఈ దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించారు. వీరి ద్వారా దోపిడీ చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లుగా పోలీసులు గుర్తించారు.