నగరంలో సామగ్రి కొనుగోలు
గుంటూరు మిర్చి యార్డు కార్మికుల ‘ఆధార్’ సేకరణ
పది వేల ఫింగర్ ప్రింట్
సూత్రధారి వ్యవహారంలో కొత్త కోణం
సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): 10 వేలి ముద్రల తయారీ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారి వెంకటేశ్వర్లు యూట్యూబ్‌లో కోచింగ్ తీసుకున్నట్లు తేలింది. ఫింగర్ ప్రింట్స్ మేకింగ్‌కు సంబంధించి వందలాది వీడియోలను వీక్షించిన అతడు.. ఇందుకు అవసరమైన సామగ్రిని నగరంతో పాటు ఏపీలోని పలు పట్టణాల్లో సమకూర్చుకున్నాడు. ఆధార్ ఎనేబుల్ సేవల గురించి పూర్తిగా అధ్యయనం చేశాడు. ఈ సర్వీసు సేవలకు ఏజెంట్‌గా నియమించుకునే ఈ పాయింట్ ఇండియా కంపెనీ హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకున్నాడు.
మిర్చి యార్డులో..
ముందస్తుగా గుంటూరులోని మిర్చియార్డులో పని చేసే కార్మికుల ఆధార్‌కార్డులను మధ్యవర్తుల ద్వారా సేకరించాడు. అక్కడ రోజు వారీ కూలీ పేరుపై ఏజెంట్‌గా నమోదైన వెంకటేశ్వర్లు రెండున్నర ఏండ్లగా చీటింగ్ దందాను నడిపించాడు. ఇందుకోసం ఏపీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్ లోపాలను గుర్తించి వాటిని టార్గెట్ చేసి రోజుకు 200 రిజిస్ట్రేషన్ అయిన సేల్డీడ్లను డౌన్లోడ్ చేసుకున్నాడు. వాటిలో ఉండే వేలి ముద్రలు, ఆధార్ కార్డులతో మొత్తం 10 వేల వేలు ఫింగర్ ప్రింట్స్‌ను రూపొందించాడు. ఏజెంట్‌గా నమో దై పొందిన బయోమెట్రిక్ యంత్రం ఆధారంగా వేలు ముద్రలను స్కానింగ్ చేసుకుని డబ్బులను కొల్లగొట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిని కార్మికుల ఖాతాలకు బదిలీ చేసి.. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకున్నాడు.
బ్యాంక్ అకౌంట్లు పరిశీలించి..
ఈ పాయింట్ ఇండియా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ముందస్తుగా నేరం జరిగిన తీరును అధ్యయనం చేశారు. ముందుగా బ్యాంక్ ఖాతాలను పరిశీలించి కార్మికుల వద్దకు వెళ్లినప్పుడు వారు తమకేం తెలియదని.. పరిచయం ఉన్న వ్యక్తి అడిగితే ఇచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాలకు లింక్ ఉన్న ఫోన్ నంబర్లను క్రోడీకరించారు. అయితే 120 సిమ్ కార్డులు ఒకే ప్రాంతం నుంచి తీసుకున్నారని తెలుసుకుని అక్కడి నుంచి దర్యాప్తు మొదలు పెట్టగానే వెంకటేశ్వర్లు అండ్ టీం దొరికిపోయింది.