విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వెంగళరావునగర్, జనవరి 30: సమాజ హితానికి కవిత్వాన్ని, గేయాలను రాసి, సమాజోద్ధరణకు కవి సుద్దాల అశోక్ తేజ పాటు పడ్డారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఆకృతి అనే సంస్థ ‘జాతీయ కవి వేటూరి సుందర రామమూర్తి 87వ జయంతి పురస్కారాన్ని, జాతీయ అవార్డు గ్రహీత, సుద్దాల అశోక్ తేజకు ప్రదానం చేసి ఆయన్ను అభినందిందరు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎందరో కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. సుద్దాల వ్రాసిన ‘నైను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి’ పాట జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా అవార్డు అందుకోవడం ఆయన కృషి కి దక్కిన గౌరవమన్నారు. సుప్రసిద్ధ కవి వేటూరి సుందర రామమార్తిని స్మరించుకుంటూ అదే స్ఫూర్తితో పాటలు రాస్తున్న అశోక్ తేజని సన్మానించడం ఎంతో సముచితమన్నారు. రాష్ట్ర యువ కవులు అశోక్ తేజ స్పూర్తితో సమాజ హితానికి తమ రచనలు అందించాలన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్ అచ్యుత జగదీష్ చంద్ర, మాట్లాడుతూ సుద్దాల రాసిన గేయాలు త్వరలో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కొమరం భీముడో పాట ప్రతి తెలుగు ఇంటిలోనూ, ప్రతి కార్యక్రమంలోను జనాలు పాడుకునేలా ఉంటుందన్నారు. కార్యక్రమానికి ఆకృతి సుధాకర్ అధ్యక్షులుగా వ్యవహరించారు. సామాజికవేత్త నగేష్ పెండ్యాల సుద్దాలను అభినందించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సుద్దాల అశోక్ తేజను అభినందించారు.