సిటీబ్యూరో, మే 11(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ముగిసింది. వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ఆర్భాటం జరిగిపోయింది. కానీ లక్షలాది మంది హైదరాబాద్ వాసులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మెట్రో రెండో దశ విస్తరణపై మాత్రం మళ్లీ నిశ్శబ్దమే అలుముకున్నది. రాష్ట్ర ప్రభుత్వం పంపినా ప్రతిపాదనలు, కేంద్రం వద్ద మూలుగుతుంటే, రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో సామాన్యుడికి ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. మోదీ తెలంగాణ పర్యటనలోనైనా కనీసం మెట్రో విస్తరణ ప్రకటన వస్తుందని ఆశించిన జనాలకు మొండిచెయ్యి చూపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మెట్రో ఫేజ్-2 మీద హడావుడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో పట్టాలెక్కిన బీఆర్ఎస్ ప్రతిపాదనలను రద్దు చేసింది.
అక్కడితో ఆగిపోకుండా, రీడిజైన్ పేరిట కొత్త ప్రతిపాదనలు తెరమీదకు తీసుకువచ్చింది. హడావుడిగా డీపీఆర్ తయారు చేసి కేంద్రం చేతిలో పెట్టి సేదతీరుతుంది. కొత్తగా 120 కిలోమీటర్లకు పైగా పొడవైన కారిడార్లను నిర్మిస్తామని ప్రకటించుకున్నది. దీని అంచనా వ్యయం రూ. 40వేల కోట్లతో నగరంలో మెట్రో నిర్మిస్తామని హామీలిచ్చింది. కానీ తప్పుల తడకగా ఉన్న డీపీఆర్ చూసి కేంద్రం అడిగే ప్రశ్నలకు, దిక్కులు చూస్తున్న రాష్ట్ర సర్కారు.. ఉన్న విషయాలను సవరించుకోలేక ఇబ్బంది పడుతుంది. దీనికి తోడు భారీ ప్రాజెక్టును ప్రకటించడం ఒకటైతే, దానికి రాష్ట్ర వాటా నిధులను కేటాయించాల్సిన రేవంత్ ప్రభుత్వం.. నయా పైసా ఖర్చు చేయకుండానే, కేంద్రం ఇస్తే పనులు మొదలుపెడుతామని కాలయాపన చేస్తోంది. ఇక డీపీఆర్లోని ఆచరణకు సాధ్యం కానీ మార్గాలపై కేంద్రం అనుమతించకపోవడం కొసమెరుపు.
నార్త్ సిటీ వాసుల ఆందోళన
ముఖ్యంగా జేబీఎస్ నుంచి శామీర్పేట్, మేడ్చల్ మార్గంలో మెట్రో విస్తరణ జరగాలని, దీంతో దాదాపు 30లక్షల మంది జనాలకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని నార్త్ సిటీ మెట్రో సాధన సమితి రెండేళ్లుగా పోరాటం చేస్తుంది. నిత్యం వందలాది మంది స్థానికులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను వివరిస్తున్నారు. నార్త్ సిటీ మెట్రో సాధన సమితి చేస్తున్న పోరాటం అరణ్య రోదనగానే మిగిలిపోయింది. నార్త్ సిటీ వాసులు కొద్ది రోజులుగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం దక్కడం లేదు. చివరకు ప్రధాని పర్యటన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా, గతంలోనే లేఖల ద్వారా తమ గోడును వెల్లబోసుకున్నారు. అయినా కరుణించని ఢిల్లీ పెద్దలు, నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. ప్రతి రోజు రూ. 150 కోట్ల జీఎస్టీ రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్న నగరవాసులకు, మెట్రో వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం కేంద్రం మొండిచెయ్యి చూపుతోందని సాధన సమితి మండిపడుతుంది. ప్రధాని పర్యటన అంటే హైదరాబాద్ మిగతా IIవ పేజీలో
అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తారని ఆశించిన నగరవాసులకు నిరాశే మిగిలింది. వేల కోట్లతో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు ఇస్తున్నట్లుగా ప్రకటించిన కేంద్రం.. నగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చే మెట్రోపై ఎందుకు ఉదాసీనంగా ఉందనేది అంతు చిక్కడం లేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పంపిస్తామంటూ చేతులు దులుపుకొంటుందే తప్పా… కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించడంలో విఫలమైంది. నాడు మెట్రో ఫేజ్-1కు నిధులు ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు ఫేజ్-2 విషయంలో కొర్రీలు పెట్టడం వెనుక ఉన్న రాజకీయ ఏంటనీ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం వచ్చి వెళ్లడమే తప్పా… ఇక్కడ ప్రజల ప్రాణ సంకటమైన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదు. ఇటు రాష్ర్టానికి, అటు కేంద్రానికి లేదని ఈ పర్యటనతో మరోసారి రుజువైంది.
అంకెల్లో మెట్రో ఫేజ్-2
మొత్తం దూరం : సుమారు 129 కిలోమీటర్లు
అంచనా వ్యయం : రూ. 38,595 కోట్లు
కేంద్రం వాటా : 18శాతం
రాష్ట్ర వాటా : 30శాతం
ప్రధాన కారిడార్లు : నాగోలు-శంషాబాద్, రాయదుర్గం-కోకాపేట్, జేబీఎస్-మేడ్చల్-శామీర్పేట