సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూములను కాపాడుకునేందుకు విద్యార్థులు చేస్తున్న యుద్ధానికి తమ మద్ధతు ఎప్పుడూ ఉంటుందని ఎన్విరాన్మెంటల్ అండ్ పిక్టోరియల్ ఫొటోగ్రాఫర్ కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూములు, పక్షులు, జంతువులు, అరుదైన కొండలను రక్షించుకోవాల్సిన ప్రాధాన్యంపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
హెచ్‌సీయూలో కొన్ని రోజులుగా అక్కడి అరుదైన సంపదను ఫొటో ఎగ్జిబిషన్ చేసి అవగాహన కల్పించామని పేర్కొన్నారు. పోలీసులు తమ ఎగ్జిబిషన్‌ను నిలిపివేశారని, నిర్వహించిన వారిని సైతం అరెస్ట్ చేశారని వాపోయారు. ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం భూముల వేలం దుర్మార్గమైన ఆలోచనని విమర్శించారు. హెచ్‌సీయూ బయోడైవర్సిటీ ప్రమాదంలో పడుతుందని, ముఖ్యంగా అరుదైన మష్రూం రాక్ ఉందన్నారు. ఈ రాతిశిలను 1997లో తాను ఫొటో తీసినట్టు పేర్కొన్నారు.
400 ఎకరాల్లో విస్తరించిన బయోడైవర్సిటీ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ విద్యార్థుల ఉద్యమానికి మద్ధతు పలకాలని కోరారు. తాము ఇప్పటికే రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సైతం లేఖ ద్వారా తెలియజేశామని చెప్పారు. పోలీసులు విద్యార్థులను అమానుషంగా కొట్టడం, అమ్మాయిలని కూడా చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పేరుకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని భూములను రక్షించాలని డిమాండ్ చేశారు.