Phone Tapping Case | నాంపల్లి క్రిమినల్ కోర్టులు : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం ప్రణీత్‌రావు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు ఒకటో అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూర్తి చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి గైర్హాజర్ కావడంతో పీపీ వాదనల కోసం విచారణను 13కు వాయిదా వేస్తూ జడ్జి రమాకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణీత్‌రావు ఒక్కరే జైలులో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఉన్న భుజంగరావు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ను ఇదే కోర్టు మంజూరు చేసిందని గుర్తుచేశారు.
మధ్యంతర బెయిల్ గడువును పెంచుతూ ఆదేశాలు జారీ చేసిందని, చివరగా మధ్యంతర బెయిల్ గడువును పెంచాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో నిందితుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. హైకోర్టు సైతం గడువును పెంచుతూ వచ్చిందని, అనంతరం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించిందన్నారు. హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో విచారణ పూర్తి కాలేదని అధికారులు పేర్కొన్నప్పటికీ పీపీ వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చిందన్నారు. 90 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నందున.. ప్రణీత్‌రావు తరఫున 167 సీఆర్పీసీ కింద దాఖలు చేసిన మ్యాండేటరీ (తప్పనిసరిగా) బెయిల్‌ను 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసిందని తెలిపారు.
విచారణ కొనసాగిస్తున్నామనే కారణం తెలుపుతూ 90రోజుల్లోపే చార్జిషీట్ దాఖలు చేయడంతో బెయిల్ మంజూరుకు అడ్డంకిగా మారిందన్నారు. తప్పులను సవరించి చార్జిషీట్ దాఖలు చేయాలని కోర్టు రిటర్న్ చేసిన సమయంలో మాండేటరీ బెయిల్ మంజూరు చేయాలని నిందితుడి తరఫున బెయిల్ దాఖలు చేయగా, అదే రోజు చార్జిషీట్‌ను తిరిగి కోర్టుకు దాఖలు చేసిందనే కారణంతో కోర్టు బెయిల్ పిటీషన్‌ను కొట్టివేసిందన్నారు. తిరుపతన్నకు సుప్రీంకోర్టు, రాధాకిషన్‌రావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. 11 నెలలు పూర్తిచేసుకుని చంచల్గూడా జైలులో రిమాండ్‌ఖైదీగా ఉన్న ప్రణీత్‌రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని, విచారణ కొనసాగింపు చర్యల్లో భాగంలో పోలీసులు ఎలాంటి ఆధారాల్ని కోర్టుకు దాఖలు చేయలేదన్నారు. కౌంటర్లో పేర్కొన్నట్టుగా విచారణ పెండింగ్‌లో ఉందన్న విషయం అవాస్తవం అన్నారు.