సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): తెలంగాణ సెక్రటేరియట్‌కు మూడురోజుల పాటు వరుసగా కాల్స్ చేసి బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయంలోని అర్జీలు, ఫిర్యాదుల విభాగానికి ఓ వ్యక్తి మూడురోజులుగా వరుసగా ఫోన్లు చేశాడు. ఉద్యోగులు, సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు. సీఎంఓ కార్యాలయం ఫిర్యా దు మేరకు అలర్ట్ అయిన పోలీసులు మంగళవారం ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత మూడురోజులుగా సెక్రటేరియట్ పేల్చేస్తానంటూ ఒక ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. ఆ ఆగంతకుడి కాల్స్ ట్రేస్ చేసిన పోలీసులు అతను లంగర్‌హౌజ్‌కు చెందిన మీర్ మహమూద్ హుస్సేని అలియాస్ సయ్యద్ ఇర్ఫాన్ అన్వర్‌గా గుర్తించారు.
బెదిరింపు కాల్స్ చేసిన మీర్ మహమూద్‌ను ఎస్పీఎఫ్ పోలీసులు విచారించారు. సెక్రటేరియట్లో తన సమస్యను తీర్చడం లేదని అందుకే అధికారులపై కోపంతో అలా ఫోన్ చేశానని పోలీసులకు మీర్ మహమూద్ చెప్పాడు. లంగర్‌హౌజ్‌లోని హజరత్ సయ్యద్ షా మీరాన్ హుస్సేని రహమతుల్లా దర్గాకు సంబంధించిన ముతవలి నియామకం సమస్య గురించిన వివాదంపై అర్జీ పెట్టుకుంటే అధికారులు స్పందించలేదని మీర్ మహమూద్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈక్రమంలో అతను పొంతనలేకుండా మాట్లాడుతూ మతిస్థిమితం లేనివాడుగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలోనే పోలీసులకు, సెక్రటేరియట్ అధికారులతో మీర్ మహమూద్ వాగ్వాదానికి దిగా డు. మరోవైపు సచివాలయంలో బాంబు లేదని తేలడంతో పోలీసు లు ఊపిరి పీల్చుకున్నారు.
అయి తే అసలు మీర్అలీ ఫోన్ చేయడానికి అతను చెబుతున్న కారణాలు సరైనవేనా.. లేక ఎవరైనా అతని తో ఫోన్ చేయించారా.. అనే కో ణంలో సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం కార్యాలయానికే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం, మూడురోజుల పాటు బయటకు పొక్కనీయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెక్రటేరియట్లో భద్రతావైఫల్యంపై చర్చ జరుగుతోంది. ఇటీవల రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్నంటూ ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి నకిలీ ఐడెంటిటి సృష్టించుకుని సెక్రటేరియట్లో హల్చల్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వరుస ఘటనలతో సచివాలయం భద్రతపై చర్చ జరుగుతోంది.