సిటీబ్యూరో, మార్చి 22, (నమస్తే తెలంగాణ) : వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల కరిగిపోతున్న హిమానీ పర్వతాలను కాపాడుకోవాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ డైరెక్టర్ పీజీ శాస్త్రి పిలుపునిచ్చారు. శనివారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రపంచంలోనే చైనా, అమెరికా తర్వాత ఇండియాలో 2800 ప్రాజెక్టులుండగా ఈ నీరు మన దేశ ప్రజలకు సరిపోవడం లేదన్నారు. భూగర్భ జలాలను అధికంగా వాడటం వల్ల హైదరాబాద్ లో ట్యాంకర్లతో నీళ్లు కొనుకుంటున్నామని గుర్తు చేశారు. కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు పూర్వ చైర్మన్ ఏ. పరమేశం మాట్లాడుతూ కృష్ణానది జలాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మహారాషా్ర్టలకు వాటాలున్నందువల్ల ఏ రాష్ర్టానికి తగినన్ని నీళ్లు రావడం లేదన్నారు.
అనంతరం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జంబుల్ రెడ్డి మాట్లాడుతూ షాద్ నగర్ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు ఒకటి నిర్మిస్తే హైదరాబాద్కు గ్రావిటీ ద్వారా నీళ్లు అందించవచ్చన్నారు. ఈ సమావేశంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనుపమ మొహంతి, ఎం. రాజశేఖర్ రెడ్డి, జి. నరేష్, ఎస్ఏ. కవిత విద్యార్థులు పాల్గొన్నారు.