పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకు దడ పుట్టిస్తున్నాయి..సామాన్యుల జీవితాలను ఆగం చేస్తున్నాయి..ఆర్థికస్థితిగతులను ఛిద్రం చేస్తున్నాయి..నెలవారి బడ్జెట్ తలకిందులవుతోందని వేతన జీవులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు నడుపాలంటే భయపడే రోజులొచ్చాయి. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం సరుకు రవాణాపై పడడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా చితికిన వారు పెరిగిన ధరలతో మరింత దిగజారుతున్నారు.
ఇప్పుడిప్పడే వ్యాపారాలు పుంజుకుంటుండగా, పెట్రో బాంబుతో వ్యాపారం తగ్గుముఖం పడుతున్నదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంధన ధరల మోతతో ఆటోలు, విద్యాసంస్థల వ్యాన్లు, క్యాబ్ ధరలు పెంచడంతో తిరిగే పరిస్థితి లేకుండా పోతున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు ప్రియం కావడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనిపై ఆధారపడిన లక్షలాదిమంది పరిస్థితి తలకిందులయ్యే అవకాశముంది. పెట్రో దారిలో వాణిజ్య సిలిండర్ ధర కూడా భగభగమంటుండడంతో ఆహార పదార్థాలు, తినుబండారాల ధరలు అమాంతం పెరిగాయి.
దీపావళి అంటేనే పటాకుల పండుగ. చిన్నాపెద్ద కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. డీజిల్ ధర అమాంతం పెరగడంతో పటాకుల మోత ఈసారి పెద్దగా వినిపించేలా లేదు. రవాణా చార్జీలు తడిసి మోపెడవుతుండడంతో పటాకుల ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ఫలితంగా గ్రీన్ క్రాకర్లకు డిమాండ్ పెరుగుతున్నదని పేర్కొన్నారు. కాలుష్య రహితంతోపాటు తక్కువ శబ్దం రావడం గ్రీన్ క్రాకర్ల ప్రత్యేకత.
రోజు రోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యుల జీవనాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఇలాపెరుగుకుంటూ పోతున్న ధరలతో సామాన్యుడి పూట గడవడం గగనంగా మారింది. దీంతో అర్ధాకలితో బతకాల్సిన పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఏర్పడ్డాయి. ఈ పెరిగిన ధరలు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సామాన్యుడి నుంచి వ్యాపారుల వరకు ఆర్థికంగా కుదేలవ్వాల్సిన దుస్థితి నెలకొన్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ రంగం విస్తృతంగా సాగుతుంది. అయితే 15-20 రోజులుగా నిర్మాణ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొన్నిరోజుల కిందటి వరకు స్టీలు ధర టన్నుకు రూ.62-68 వేల (మంచి కంపెనీ) వరకు ఉండగా… రూ.57-58వేలు (లోకల్ కంపెనీలు) వరకు ఉండేవి. కానీ ఇప్పుడు టన్నుకు రూ.6 వేల నుంచి రూ. 10 వేల వరకు పెరిగింది. 53 గ్రేడ్ సిమెంటు బస్తా రూ.350-360 ఉండేది. సాధారణ కంపెనీలవి బస్తా రూ.300 వరకు ఉండేవి. ఇప్పుడు ఒక్కో బస్తాపై కనీసంగా రూ.50-80 వరకు పెరిగాయి. ఫలితంగా నిర్మాణ అంచనాల్లో లక్షల రూపాయల భారం పెరిగిపోతుందని నిర్మాణదారులు వాపోతున్నారు.
మార్కెట్లో కొద్ది రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. రూ. 500 నుంచి రూ. వెయ్యి పెడితేగాని వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదు. పెట్రో, డీజిల్ ధరలు పెరగడంతో రైతులకు మార్కెట్‌కు కూరగాయాలు తీసుకురావడం భారంగా మారింది. డిమాండ్ మేరకు సప్లయ్ కాకపోవడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి.
గ్యాస్, పెట్రో ధర మంటలు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కరోనాతో ఏడాదిన్నరగా పాఠశాలలు మూతపడ్డాయి. పూర్తిస్థాయిలో గత నెలలోనే స్కూల్స్ తెరుచుకోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తున్నారు. చాలా మంది ప్రైవేట్ విద్యార్థులు ఆటోలు, వ్యాన్లు, స్కూల్ బస్సులలో వెళ్లివస్తుంటారు. గతంలో సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్కూల్‌కు ఒక్కొక్కరు ఆటోకు వెయ్యి రూపాయల వరకు చెల్లించే వారు. ప్రస్తుతం రూ.1500 తీసుకుంటున్నారు. అదే వ్యాన్కైతే గతంలో రూ.1200 ఉన్నది ఇప్పుడు రూ. 2 వేలకు పెరిగింది.
ఇంధన ధరలు పెరుగుదల క్యాబ్ సర్వీస్‌లపై ప్రభావం చూపుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా క్యాబ్‌లను నడపలేని పరిస్థితి ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరోక్షంగా కస్టమర్లు నష్టపోతున్నారు. క్యాబ్ బుకింగ్ పూర్తయిన అనతరం డ్రైవర్లు ఆ రైడ్‌ను రద్దు చేస్తుండటంతో కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ కారణంతో కూడా డ్రైవర్లు ఆ ట్రిప్పును రద్దు చేస్తున్నారు. దీంతో కొంతకాలంగా ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్‌లో అంతరాయం నెలకొంది. ఫలితంగా నిమిషాల వ్యవధిలో క్యాబ్ బుక్ కావాల్సిన ట్రిప్పు.. అరగంట సమయం ప్రయత్నించినా సర్వీస్ కనెక్ట్ కావడం లేదు. దీంతో కస్టమర్లు క్యాబ్సర్వీస్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్, నవంబర్ 2 : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఉత్సాహంగా దీపావళి పండగ చేసుకుంటారు. రంగు రంగుల బాణాసంచా కాలుస్తూ పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు.. ప్రతి ఇంటా కొత్త కాంతులు నింపే ఈ పండగ.. ఈ ఏడాది మండుతున్న బాణాసంచా ధరలతో డీలా పడిపోయింది. కొవిడ్ భయంతో చాలా మంది వ్యాపారంపై ఆందోళన చెందుతుండగా, పెరగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా చార్జీలు తడిసి మోపెడయి.. ఆ ప్రభావం బాణాసంచా వ్యాపారంపై పడింది. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.
ఒకరిద్దరు చిన్న పిల్లలున్న ఇంట్లో గిఫ్ట్ ప్యాక్ తెచ్చుకుంటారు. దీని కోసం రెండు, మూడు రకాల గిఫ్ట్ ప్యాక్‌లు ఆయా బాణాసంచా కంపెనీలు తయారు చేస్తాయి. రకాలను బట్టి ధర ఉంటుంది. వీటి ధరలు ఈసారి భగ్గుమంటున్నాయి. గత ఏడాది రూ.500 ఉన్న చిన్న గిఫ్ట్ ప్యాక్ ధర ఈ ఏడాది రూ.650 నుంచి రూ.750 వరకు అమ్ముతున్నారు. అదే పెద్ద ప్యాక్ ధర రూ. 900ల నుంచి రూ.1200లకు పెరిగింది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,100 దాటింది. దీంతో వ్యాపారం సాగించడం కష్టమవుతోంది. అసలే కరోనాతో వ్యాపారం లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు గ్యాస్ బండ రేటు పెరిగిందని తిను బండరాల రేట్లను పెంచితే గిరాకీ రాదు. గిరాకీ లేకపోతే వ్యాపారానికి తీసుకున్న అప్పులు ఎట్లా తీర్చాలో తెలియడం లేదు. – నాగలక్ష్మి, మిర్చి బండి వ్యాపారి, సికింద్రాబాద్
నేను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. నా ఉద్యోగ సమయాల్లో మార్పులు ఉండడంతో ఇంట్లో వంట చేసుకోలేను. అధికంగా టిఫిన్లను బయటి నుంచి తెచ్చుకుంటాను లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను. ఇప్పుడు రూ.20 ఉన్న ఇడ్లీ రూ.35, రూ.45 ఉన్న మసాలా దోశ
రూ.70అయ్యింది. ఇప్పుడు బయటి నుంచి టిఫిన్లను తెచ్చుకోవడం భారమవుతోంది. – అప్పు, సాఫ్ట్వేర్ ఉద్యోగిని
ఇప్పటికే కరోనా కారణాన్ని చూపించి ఆన్లైన్ డెలివరీ సంస్థలు మా కమీషన్‌ను తగ్గించాయి. పెరిగిన ధరలతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ వెబ్సైట్లో వినియోగదారులకు ధరలు పెరిగాయి. మా కమీషన్ పెరగకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మేము డెలివరీ చేయడం కష్టంగా మారింది. మా బతుకులు దాదాపు పంక్చర్ అయ్యాయి. – సంతోష్ నాయక్, డెలివరీ బాయ్
నేను ఓ ప్రైవేటు ఉద్యోగిని. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉంటాం. ఒక్కడి సంపాదన మీదనే కాలం గడుపుతున్నాం. నెలకు ఒకసారి బయటి నుంచి టిఫిన్, 15 రోజులకు ఒకసారి బయటి నుంచి చాట్ తెచ్చుకుంటాం. పెరిగిన ధరలు చూస్తే ఇప్పుడు వీటిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఒక్కరోజు బయట టిఫిన్ తినాలన్నా కష్టమే. – సూర్య, ప్రైవేటు ఉద్యోగి, సికింద్రాబాద్
ఏ సమయంలోనైనా క్యాబ్ సర్వీస్ ఉంటుందని అనుకునేవాళ్లం. ఎంత దూరమైనా వెళ్లి రావచ్చు అని భావించాం. కానీ ఇప్పుడు క్యాబ్ సర్వీస్‌లు బుక్ చేయడానికి అరగంటకు పైగా సమయం పడుతుంది. తీరా క్యాబ్ ఓకే అయ్యాక రైడ్ క్యాన్సల్ అయిందంటూ మెస్సేజ్ వస్తుంది. సమయం బాగా వృథా అవుతుంది. ఇప్పుడు అరగంట ముందే క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. – కార్తీక్. ఉద్యోగి
కరోనా కారణంగా ఇప్పటికే భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయి. తాజాగా మళ్లీ స్టీలు, సిమెంటు ధరలు రెండు వారాల్లోనే ఒక్కసారిగా పెరిగాయి. ఈ పెరుగుదల భవన నిర్మాణ రంగానికి చాలా దెబ్బ. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న రంగం ఇది. ప్రాజెక్టు భారం పెరుగడంతో సామాన్యులు ఇల్లు కొనలేని పరిస్థితి ఉంది. – జి.రాంరెడ్డి, క్రెడాయ్, జాతీయ ఉపాధ్యక్షులు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే.. అన్ని ధరలు పెరిగినయి. చాయ్, టిఫిన్, భోజనం వరకు అన్నీ పెంచిండ్రు. జీతాలు మాత్రం పెంచడం లేదు. పిల్లల చదువులతోపాటు రూం కిరాయిలు పండుగొస్తే, పబ్బమొస్తే ఖర్చులు భరించలేకపోతున్నం. ధరలను అదుపు చేస్తేనే హైదరాబాద్‌లో ఉండగలుగుతాం. – రామచంద్రం, బాలాజీనగర్
నాకు ఇద్దరు పిల్లలు. కిరాయి ఇంట్లో ఉంటున్నం. ఇద్దం పని చేస్తేనే ఆడికాడికి అయితుంది. పప్పు నుంచి పండు వరకు ఇలా అన్నీ పెరిగినయి. ఇక మా అసోంటోళ్లం ఏమి తింటం. వచ్చే జీతం పిల్లల చదువులకు సరిపోవట్లేదు. మీదికెళ్లి ఆటో కిరాయిలు పెంచేసిండ్రు. ఇక పిల్లలు బడికెట్లపోయేది. జీవితమే భారమయింది. – అరవింద్ చారి, బొల్లారం
ఓలా, ఉబర్ సంస్థలు డ్రైవర్లను పట్టించుకోవడం లేదు. పెరిగిన ఇంధన ధరలతో ట్రిప్పులు చేయడం కష్టంగా ఉంది. కస్టమర్లు క్యాబ్ బుక్ చేసుకున్నా.. వివరాలు తెలుసుకుని ట్రిప్పు రద్దు చేస్తున్నాం. కస్టమర్ వద్దకు వెళ్లి తిరిగి నిర్దేశిత ప్రాంతంలో డ్రాప్ చేయడానికి అయ్యే ధర క్యాబ్ సర్సీస్‌లో చూపించడం లేదు. ఫలితంగా డ్రైవర్లు నష్టపోతున్నారు. కస్టమర్లు సెట్ చేసిన లొకేషన్ పికప్, డ్రాపింగ్లో సరిగ్గా ఉండటం లేదు. పెరిగిన ధరలతో దానిని భరించలేం. -షేక్ సలాఉద్దీన్, అధ్యక్షుడు, తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్
భవన నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదలతో ఇండ్లు, అపార్టుమెంట్లలో ఫ్లాట్ల కోనుగోలుదారులపై అదనంగా భారం పడుతోంది. ఇప్పటికే నగరంలో సామాన్యులు సొంతింటి కలను నిజం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా పెరుగుతున్న ధరలతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ధరలపై నియంత్రణ లేకపోతే సామాన్య, మధ్య తరగతి ప్రజలు సొంతింటిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.- ప్రవీణ్, బిల్డర్, అత్తాపూర్
కరోనా మా జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూళ్లు తెరుచుకున్నా పిల్లలు సరిగ్గా రావడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడంతో స్కూళ్ల వద్ద ఆటోలు, వ్యాన్ డ్రైవర్లు, యజమానులం కలిసి మాట్లాడుకుని చార్జీలు కూడా పెంచాం. గతేడాది ధర అయితేనే పిల్లలను పంపిస్తాం అంటున్నారు.. కానీ మాకు గిట్టుబాటు కావడం లేదు. ఇప్పుడు మాకు విద్యార్థులు నిండుగా రావడం లేదు. ఇక ఆటో నడపలేం… అట్లా అని బంద్ పెట్టలేం.. ఆటో డ్రైవర్లంతా చాల కష్టాల్లో ఉన్నాం. – నర్సింహా, ఆటో డ్రైవర్
దసరా తర్వాత ఇండ్ల కొనుగోలు ఆశాజనకంగా ఉంటుందనుకుంటున్న తరుణంలో భవన నిర్మాణ సామాగ్రి ధరలు అమాంతం పెరుగుతూ రావడం ఊహించని పరిణామం. పెరిగిన ధరలు కేవలం రియల్ రంగానికే కాకుండా సొంత ఇల్లు కట్టుకునే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజల ఇంటి కొనుగోలు కష్ట సాధ్యమనే చెప్పాలి. – ప్రేమ్‌సాగర్ రావు, మేనేజింగ్ డైరెక్టర్, జయభారతి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్