PETA India | ఖైరతాబాద్, జూన్ 10: రాష్ట్రంలో జంతువులపై జరుగుతున్న హింసను నిలువరించాలని శాస్త్రవేత్త, పరిశోధన విధాన సలహాదారు (పెటా ఇండియా ప్రతినిధి)డాక్టర్ అంజనా అగర్వాల్ కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
కొత్త బ్రీడ్ తయారు చేసేందుకు నిర్వహకులు జంతువులపై హింసాపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారని.. ఫలితంగా పెద్ద సంఖ్యలో అవి మృత్యువాత పడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ఓ బయోసైన్స్ ల్యాబ్లో నిర్వహకులు వికృత చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. స్టెరాయిడ్స్ లాంటివి వాడుతూ వాటి ప్రాణాలను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మందులను ఆమాయక జంతువులపై విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నారని, అడవుల నుంచి అక్రమంగా కోతులను తీసుకువచ్చి వాటిపై ప్రయోగాలు జరుపుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సస్పీషియస్ ఫర్ ఎక్స్పరిమెంటేషన్ ఆన్ ఎనిమల్స్ (సీసీఎస్ఈఏ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండార్డ్ కంట్రోల్ ఆర్గనేజేషన్ (సీడీఎఎస్ సీ వో), నేషనల్ గుడ్ ల్యాబరేటరీ ప్రాక్టీస్ కంప్లియన్స్ మానిటరింగ్ అధారిటీ (ఎన్ జీసీఎంఏ) లకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే సదరు బయోసైన్స్ ల్యాబ్ లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.