కుత్బుల్లాపూర్, జనవరి 3 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం…కొంపల్లి జయభేరి ప్రాంతంలోని రుద్ర బృందావన్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న విశ్వనాథ్శ్రావణ్కుమార్(40 ) హెచ్ఏఎల్ బాలానగర్లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం బైక్పై ఉద్యోగానికి బయలుదేరాడు.
జీడిమెట్ల విలేజ్ బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం సమీపంలోకి రాగానే.. వెనకాల నుంచి గుర్తు తెలియని ఇన్నోవా కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్పై నుంచి విశ్వనాథ్శ్రావణ్కుమార్ కిందపడడంతో.. అదే సమయంలో వేగంగా వచ్చిన డీసీఎం అతనిపైనుంచి వెళ్లింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.