సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ) : నార్త్ సిటీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటూ 152 రోజులుగా ఎదురుచూస్తున్నారు. మెట్రో విస్తరణ పేరిట ఆ ప్రాంతానికి రెండు మార్గాల్లో మెట్రో మార్గాన్ని తీసుకువస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారే తప్పా… ఇప్పటికీ డీపీఆర్ పూర్తి చేయలేకపోయారు. ఇక తమ ప్రాంతానికి ఎంతో కీలకమైన మెట్రో డీపీఆర్ ఇంకెప్పుడూ అంటూ మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆందోళన చెందుతున్నది. నార్త్ సిటీ మెట్రో నిర్మాణంలో కీలకమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను మార్చి 31లోపు ప్రభుత్వానికి డీపీఆర్ అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా… ఇప్పటికీ రూపకల్పన ప్రక్రియ సాగుతున్నదని మెట్రో రైలు సంస్థ వెల్లడించడంపై మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
ఈ క్రమంలో నిర్ణీత గడువులోగా ఇచ్చిన హామీ ప్రకారం డీపీఆర్ కేంద్రానికి అందజేయాలని, ఆ వెంటనే ఆమోదంతో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నార్త్ సిటీ ప్రజలకు కొత్త ఏడాది కానుకగా మెట్రో నిర్మాణంపై సీఎం ప్రకటన చేశారు. మార్చి 31లోపు డీపీఆర్ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. కానీ గడిచిన 150 రోజులుగా ఇచ్చిన హామీకి ఎలాంటి రూపం లేకుండా పోయిందన్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఓవైపు కాలుష్య తీవ్రత, మరోవైపు అనారోగ్య సమస్యలు ఈ ప్రాంత వాసులను చుట్టుముడుతున్నాయన్నారు.
డీపీఆర్ తయారీకి నెలల కొద్ది సమయం తీసుకుంటే… ఇక నిర్మాణం ఇంకెప్పుడూ చేస్తారంటూ ప్రశ్నించారు. తక్షణమే నార్త్ సిటీ డీపీఆర్ సిద్ధం చేయాలని, తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన ప్రభుత్వం మెట్రో నిర్మాణం విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నదో సమాధానం చెప్పాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేసింది.