Rajendra Nagar | మైలార్‌దేవ్‌పల్లి, మే 5: రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బర్త్ డే వేడుకలు కాస్త సామాన్యులకు ఇబ్బందిగా మారాయి. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఇంటి ముందు నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారిలో ఒకవైపు వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో స్థానికులు అనేక అవస్థలు పడ్డారు.
ప్రకాశ్‌గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్ శివారు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ చౌరస్తా ప్రాంతంలోని ఆయన నివాసానికి పెద్దఎత్తున నాయకులు వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటిముందు ఒకవైపు రాకపోకలను నిలిపివేసి తమ వాహనాలను పార్క్ చేసుకున్నారు. దీంతో లక్ష్మీగూడ నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు నానా తంటాలు పడ్డారు. ఉదయం ఉద్యోగాలకు, కళాశాలలకు, వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారికి ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బందులను సృష్టించింది. తీవ్ర స్థాయిలో వాహనాలు నిలిపిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి ప్రజలు ఈ ట్రాఫిక్‌లోనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోయారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఇలా కార్యక్రమాలు చేయడం సరైంది కాదని ఇలాంటివి ఉంటే తమ ఇంట్లో, ఫంక్షన్ హాల్స్‌లో చేసుకోవాలి కానీ ఇలా రోడ్లను మూసి వేసి వేడుకలు చేసుకోవడం ఏమిటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.