మియాపూర్, ఫిబ్రవరి 4 : అధికారులు వీధి దీపాల(Street lights) నిర్వహణను విస్మరించటంతో వీధులు చీకట్లు కమ్ముకుంటున్నాయి. అసలే చైన్ స్నాచింగ్‌లు, దొంగల భయం, వీధి కుక్కల దాడి, గంజాయి బ్యాచుల వీరంగంతో హడలెత్తుతున్న నేపథ్యంలో వీధి దీపాలు లేకపోవటం మరింత ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఐటీ పరిశ్రమలకు వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లో వీధి దీపాల నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో ప్రధానంగా బస్తీవాసులు బిక్కుబిక్కుమంటూ రాత్రి వేళల్లో రాకపోకలు సాగిస్తున్నారు. జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, యూసుఫ్‌గూడ, ఆర్సీపురం, పటాన్చెరు సర్కిళ్లలో సుమారు 15 వేల వీధీ దీపాలు పని చేయటం లేదు. సుమారు ఏడాది కాలంగా అవి నిర్వహణకు నోచుకోకపోవటంతో వీధులు చీకట్లో మగ్గుతున్నాయి.
వెలగని వీధి దీపాలలో అత్యధికంగా యూసుఫ్‌గూడ సర్కిల్ పరిధిలోనే 4 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. వీటి నిర్వహణకు సంబంధించి బల్దియా ఉన్నత కార్యాలయం నుంచి బడ్జెట్ లావాదేవీలు జరుగుతుం డగా..గుత్తేదారుల కేటాయింపు సైతం అవుతున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులను పర్యవే క్షించి వీధి దీపాలకు మరమ్మతులు చేయించుకోవాల్సిన బాధ్యత జోన్‌లోని ఎలక్టికల్ విభాగానిదే. అయితే ఇటీవలి కాలంలో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయించగా..జోన్ వ్యాప్తంగా సుమారు 13-15 వేల వరకు విద్యుత్ దీపాలకు మరమ్మతులు అవసరంగా గుర్తించారు.
సుమారు ఏడాది కాలంగా ఎటువంటి నిర్వహణ లేక వేలాది వీధి దీపాలు పని చేయక స్థానిక ప్రజలు రాత్రి వేళల్లో రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శేరిలింగంపల్లి జోన్‌లోని నాలుగు సర్కిళ్లలో కలిపి మొత్తం 72 వేల వరకు వీధి దీపాలున్నాయి. వాటిల్లో 15 వేల వరకు పని చేయకపోతుండటం గమనార్హం. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎప్పటికపుడు వీధి దీపాల మరమ్మతులపై అధికారులకు విన్నవిస్తున్నా…అంతగా ఫలితం కనిపించటం లేదన్న అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.