సిటీబ్యూరో, జూన్ 22(నమస్తే తెలంగాణ): కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన అఖిలేశ్ అనే వ్యక్తిపై శనివారం ఇద్దరు వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో అతని పళ్లు ఊడిపోవడమే కాకుండా ముఖంపై బాగా దెబ్బలు తగిలాయి. తనపై దాడిచేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే బయటనే మాట్లాడుకోండి..ఈ పంచాయితీ ఇక్కడెందుకంటూ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఫిర్యాదు తీసుకోకుండా బాధితులను స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
మలక్‌పేటలో ఇటీవల ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగా తీవ్రంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ డియాలో వైరల్ అయింది. అయితే సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మే నెల చివరి వారంలో రెండు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తమపై దాడులు చేయాలని చూస్తున్నారని లెటర్ హెడ్‌పై ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి స్పందన లేదు. చివరికి జూన్ 12న దాడి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశంతో బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
హుస్సేని ఆలం పోలీస్‌స్టేషన్‌లో ఒక వ్యక్తి తనకు ఒకతనితో ప్రాణాపాయం ఉందంటూ పదిరోజుల కిందట ఫిర్యాదు చేశారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా ఎదుటివారితో బయటనే మాట్లాడుకొని సెటిల్ చేసుకోమని చెప్పినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై ఎక్స్‌లో కూడా పోస్ట్ చేసినా వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదని బాధితుడు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతీరోజూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో చాలా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వచ్చే బాధితులకు ఎదురవుతున్నాయి. పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కి సమస్య చెప్పుకొంటే చాలు..పరిష్కరిస్తారు.. పరిష్కార మార్గం చూపిస్తారనే నమ్మకం ప్రజల్లో గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం అదే పోలీసులు ప్రజల ఫిర్యాదులను పట్టించుకోకుండా తమకెందుకులే పంచాయితీ అంటూ బయటనే సెటిల్మెంట్ చేసుకోమని చెబుతున్నారు.
కమిషనరేట్ పరిధిలో పాతబస్తీతో పాటు ఉస్మానియా పోలీస్‌స్టేషన్, మలక్‌పేట, లంగర్‌హౌజ్, బేగంపేట, జూబ్లీహిల్స్, బోరబండ, బొల్లారం తదితర పోలీస్స్టేషన్లలో కొన్ని ఫిర్యాదులకు ఇదే సమాధానం ఎదురైనట్లుగా బాధితులు చెప్పారు. బాధితులు తమకు అన్యాయం జరిగిందంటూ..పీఎస్‌కి వెళ్తే వారి నుంచి వచ్చే సమాధానాలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయని, కొన్ని చోట్లనైతే వీటికే ఇంత దూరం రావాలా అంటూ పోలీసులంటున్నారని ఫిర్యాదుదారులే చెబుతున్నారు.
ఫిర్యాదు రాగానే నాన్చుడు ధోరణి ప్రదర్శించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టంగా చెప్పామని పోలీస్ స్టేషన్ వేదికగా ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ ప్రయత్నాలు చేస్తే చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పలుసార్లు చెప్పారు. కానీ కొందరు పోలీసులు తమ పద్ధతి మార్చుకోకుండా న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఫిర్యాదు రాగానే చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది పోయి అడ్డగోలు కారణాలతో కాలయాపన చేస్తున్నారు. మహిళలకు వేధింపులు, బెదిరింపులు, మోసాలు వంటి ఉదంతాల్లోనూ విపరీతమైన నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదుదారులు నేరుగానే కాకుండా ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్, ఎక్స్.. ఇలా ఏ రూపంలో ఫిర్యాదు చేసినా ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలిపించి వారిని విచారించి బాధితులకు న్యాయం చేసే దిశగా ఎఫ్ఐఆర్ నమోదు చేయా ల్సి ఉంటుంది. ఇలా చట్టంలో మార్పు వచ్చినా కొందరు ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు మాత్రం తమ పాత పద్ధతులను మార్చుకోవడం లేదు. ఇతర పద్ధతుల ద్వారా ఫిర్యాదు పక్కన పెడితే నేరుగా స్టేషన్‌కు వెళ్లినా కూడా స్పందన ఉండ డం లేద ని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి పోలీసులపై ఒత్తిడి ఉంటోంది. ఫలితంగా ఈ పంచాయితీ తమకెందుకంటూ కేసుకు బదులు రాజీ ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతున్నాయి.
ఎఫ్ఐఆర్ నమోదైతే దానిపై విచారణ వేగవంతం చేయలేకపోతున్నామన్న విషయం ఒకటైతే పెండింగ్ కేసుల సంఖ్య ఎక్కువైతే తమ పై అధికారులతో క్రైం రివ్యూల్లో చీవాట్లు ఉంటాయన్న నెపంతో ముఖ్యమైన, కీలకమైన కేసులు తప్ప మిగతా ఫిర్యాదులపై పెద్దగా స్పందించడం లేదని ఓ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భూ వివాదాలు, గొడవలు, మహిళలకు వేధింపులు.. ఘటన ఏదైనా అందులో సెటిల్మెంట్లకు పలుకుబడిగల వ్యక్తులు, నేతల జోక్యం పెరుగుతోందని.. దీనితో తమకు పని తగ్గుతున్నదని భావిం చి ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆ అధికారి పేర్కొన్నారు.