సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడితో పాటు దొంగిలించిన సొమ్మును కొనుగోలు చేస్తున్న మరో పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీపెరుమాళ్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌కు చెందిన రత్లావత్ శంకర్ నాయక్ అలియాస్ రాజేశ్ రెడ్డి 12 ఏండ్లుగా ఇండ్లల్లో దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతూ వస్తున్నాడు. అతడిపై నాలుగు సార్లు పీడీ యాక్టు ప్రయోగించినా.. నేరబుద్ధిని మాత్రం మార్చుకోలేదు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన అతడు రాచకొండ, సైబరాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. తక్కువ కాలంలోనే 8 ఇండ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డాడు. విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ బృందం ప్రధాన నిందితుడైన రత్లావత్ శంకర్ నాయక్‌ను అరెస్టు చేసింది. దొంగిలించిన సొమ్మును మరో పాత నేరస్తుడైన బంద్రవల్లి రాకేశ్ అలియాస్ రాఖీ ద్వారా ఇతరులకు విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని కూడా అరెస్టు చేశారు. ఇద్దరి నుంచి రూ. 6.7లక్షల విలువైన 80 గ్రాముల బంగారం, 25 గ్రాముల వెండి, ఒక బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.