బంజారాహిల్స్: కీసరకు చెందిన వ్యాపారి గుండోజి సాయికిరణ్(34)కి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను బంజారాహిల్స్ ఎస్ఐ రాఘవేంద్రనని, ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు వచ్చిందని చెప్పాడు. తాను కొన్నిరోజుల్లో బిల్లు చెల్లింపు చేస్తానంటూ సాయికిరణ్ చెప్పినా వినిపించుకోకుండా వెంటనే బిల్లు చెల్లించాలని, లేకుంటే బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు అవుతుందని, ‘నిన్ను తెచ్చి లాకప్‌లో పడేస్తానం’టూ బెదిరించాడు.
అనుమానం వచ్చిన సాయికిరణ్.. ఆగంతకుడిని నంబర్ పరిశీలించగా డీపీగా బంజారాహిల్స్ సీఐ రాఘవేంద్ర ఫొటో కనిపించింది. ఆన్లైన్లో పోలీస్ వెబ్సైట్లో ఉన్న ఫొటోను డౌన్లోడ్ చేసుకుని తన డీపీగా పెట్టుకున్న ఆగంతకుడు.. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించిన బాధితుడు సాయికిరణ్.. గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా తన ఫొటోను దుర్వినియోగం చేస్తున్న ఆగంతకుడికి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫోన్ చేయగా సమాధానం ఇవ్వకుండా తానే ఎస్ఐ అంటూ ఫోన్ పెట్టేయడం కొసమెరుపు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.