కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 2 : ఎట్టకేలకు కైత్లాపూర్ రోడ్డు విస్తరణ పనులకు మార్గం సుగమమైందని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు. గురువారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఉదాసీన్ మఠానికి చెందిన 10,984 చదరపు గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా చేసి మఠానికి చెందిన రామకృష్ణ జడ్సీ మమతకు డాక్యుమెంట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను విస్తరించే పనులను చేపట్టామని తెలిపారు. ఇప్పటికే మూసాపేట చౌరస్తా నుంచి రెయిన్బో విస్తాస్ రాక్ గార్డెన్ సేవాలాల్‌నగర్ వరకు, కైత్లాపూర్ నుంచి కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ వరకు రహదారిని విస్తరించి అభివృద్ధి చేశామన్నారు.
కానీ ఈ మార్గంలో ఉదాసీన్ మఠానికి చెందిన స్థలం మీదుగా రోడ్డు వెళ్తుండగా ఆ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా మారిందని, విస్తరణకు అవకాశం లేకపోవడంతో పలుమార్లు ఉదాసీన్ మఠానికి చెందిన ప్రతినిధులతో చర్చించామని వివరించారు. ఎట్టకేలకు ఉదాసీన్ మఠం ప్రతినిధులు 10,984.98 చదరపు గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి బదలాయించారు. ఈ సందర్భంగా ఉదాసీన్ మఠం ప్రతినిధులకు జడ్సీ మమత కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మల్లేశ్వర్, ఉదాసీన్ మఠం ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు.