Hyderabad Metro | సిటీబ్యూరో: హైదరాబాద్లో మెట్రో సేవలు ఒక్కసారిగా స్తంభించాయి. సాంకేతిక కారణాలతో పలు మార్గాల్లో సర్వీసులు ఆగిపోయాయి. ప్రధానంగా నిత్యం రద్దీ ఉండే నాగోల్-హైటెక్ సిటీలో రెండున్నర గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6.30 గంటల నుంచే తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు నిత్యం మెట్రో మార్గంలో ప్రయాణించేవారంతా అవస్థలుపడ్డారు. బుధవారం ఉదయం నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్యలు తలెత్తాయి. ఉదయాన్నే ఒక్కసారిగా ఐటీ కారిడార్ ఉద్యోగులతో నిండిపోయే నాగోల్ మార్గంలోని పలు స్టేషన్లు అన్నీ రద్దీగా మారిపోయాయి. గంటల తరబడి రాకపోకలు నిలిచిపోవడం, పునరుద్ధరణకు గంటల కొద్దీ సమయం పట్టింది. దీంతో ఆఫీసులకు వెళ్లేందుకు కేవలం మెట్రోనూ ఆశ్రయించేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇతర మార్గాల్లో రాకపోకలు
రోజు వెళ్లే మార్గం ఒక్కసారిగా మూసుకుపోవడంతో జనాలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రధానంగా నాగోల్ నుంచి రాయ్దుర్గం వరకు వెళ్లేవారు, అదేవిధంగా అమీర్పేట నుంచి ఐటీ కారిడార్లో ప్రయాణించేవారు ఇరుక్కుపోయామనే భావనతో తీవ్ర అసహనానికి గురయ్యారు. దీనికి ప్రధాన కారణం ఉదయం నుంచే సిగ్నలింగ్ వ్యవస్థలో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ ఎల్ అండ్ టీ వాటిపై దృష్టి పెట్టలేదు. సోషల్ మీడియాలో ప్రయాణికులు స్పందించడంతో పునరుద్ధరణకు చర్యలు తీసుకుని పనులు మొదలుపెట్టారు. ఎలాంటి ప్రకటన లేకుండా రెండున్నర గంటల పాటు మెట్రో రాకపోకల్లో అంతరాయం ఏర్పడటంతో… ఇతర మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. ముఖ్యంగా నాగోల్, అమీర్పేట వద్ద ఇతర మార్గాల్లో వెళ్లిపోయారు.