సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికులకు తమ మొబైల్లోనే బస్సు సమాచారం అందించే ఆర్టీసీ గమ్యం యాప్ నిద్రావస్థలోకి జారుకుంటోంది. బస్సు ఎక్కడ ఉంది? ఎన్ని స్టేజీలు దాటింది? ఏ సమయానికి వస్తుంది? తాము ప్రయాణం చేయాలనుకున్న రూట్లో ఏం బస్సులు వస్తాయి? తదితర సమాచారం అంతా సూచించే గమ్యం యాప్ పనిచేయడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటీ బస్సుల కోసం పడిగాపులు గాసే ప్రయాణికులు యాప్‌లో సమాచారం లేక ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, తొలుత సుమారు 4,170 బస్సులను ‘ఈ’ ట్రాకింగ్ సదుపాయం కల్పించారు. జిల్లా బస్సులతో పాటు పుష్పక్, మెట్రో, సిటీ బస్సుల్లోనూ ఈ యాప్‌తో పర్యవేక్షించేల రూపొందించారు. ప్రయాణికులు సులభంగా బస్సు సేవలను ఉపయోగించుకునేల యాప్‌ను తీర్చిదిద్దారు. కానీ ఇప్పుడు ఆ గమ్యం యాప్ పనిచేయడం లేదని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. బస్సు వివరాలు ఎంటర్ చేస్తే నాట్ ఫౌండ్ అంటూ చూపిస్తుందని గ్రేటర్ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. యాప్‌లో ఉన్న సమయానికి బస్సులు రావడం లేదని చెబుతున్నారు. కొన్ని సార్లు బస్సు సర్వీసులు రద్దవుతున్నాయని.. ఆ సమాచారం కూడా యాప్ సూచించడం లేదని వాపోతున్నారు.
పారదర్శకంగా బస్సు సేవలు అందించడంలో ముందుండాల్సిన ఆర్టీసీ కొన్ని ప్రైవేటు బస్సులను యాప్ పరిధిలోకి తీసుకురావడం లేదు. మరోవైపు కొన్ని బస్సుల్లో ఈ ట్రాకింగ్ సదుపాయం ఉన్నప్పటికీ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొంతమంది డ్రైవర్లు ఇష్టానుసారంగా బస్సు రాకపోకలు సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి గమ్యం యాప్ అన్ని బస్సుల్లో పనిచేసేల చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు
కోరుతున్నారు.