సిటీబ్యూరో, జనవరి 16 ( నమస్తే తెలంగాణ ) :నెంబర్ ప్లేట్.. యెల్లో కలర్లో ఉంటే ప్రయాణికుల రాకపోకలు.. వైట్ కలర్లో ఉంటే సొంత వాహనమని అర్థం. అయితే ఇప్పుడు వైట్ కలర్ ప్లేట్ వాహనాలు కూడా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ ట్యాక్సీడ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. సొంత వాహనాలు కలిగిన యజమానులు ప్రయాణికుల వద్ద డబ్బులు తీసుకుని ట్రిప్స్ కొడుతున్నారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్లు గిరాకీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో 1.86 లక్షల మంది ట్యాక్సీ రంగంపై ఆధారపడి ఉన్నారు. అందులో 33వేల మంది ఐటీ రంగాన్ని నమ్ముకుని రైడ్స్ చేస్తున్నారు. మరో 28 వేల మంది టూర్స్ అండ్ ట్రావెల్స్‌పై ట్రిప్స్ కొడుతున్నారు. ఇప్పుడు కరోనా వెంటాడుతున్న కారణంగా డ్రైవర్లు ఈ రంగం నుంచి బయటకు రావడానికి మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు పండుగల సమయంలోనూ వారి గిరాకీని వైట్ కలర్ ప్లేట్ వాహనాలు తన్నుకుపోతున్నాయి. ఆర్టీఏ అధికారులు సరైన తనిఖీలు చేయకపోవడంతో వైట్‌కలర్ ప్లేట్ వాహనాల మోసాలు కొనసాగుతున్నాయని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర శివారు అడ్డాల మీద ప్రయాణికులను నిబంధనలకు విరుద్ధంగా ఎక్కించుకుని తీసుకెళుతున్నారని చెబుతున్నారు. అట్లాంటి వాహనాల్లో ప్రయాణాలు చేస్తే ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా వర్తించదని చెప్పారు.
ధీమాగా ప్రయాణం
ట్యాక్సీ వాహనం.. ఫిట్నెస్ సర్టిఫికెట్.. ఇన్సూరెన్స్, బార్డర్ ట్యాక్సీ, ప్రొఫెషనల్ డ్రైవర్.. రోడ్డు నిబంధనలపై అవగాహన తదితర ఆర్టీఏ నిబంధనలకనుగుణంగా ఉంటుంది. ఇందులో ప్రయాణించే వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, ప్రభుత్వ సాయం తదితరవి అందుతాయి. వీరికి బిజినెస్ ఎక్కువగా జరిగితే పరోక్షంగా వారు చెల్లించే ట్యాక్సీలతో ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. కానీ ఎలాంటి పన్నులు చెల్లించకుండానే వైట్ కలర్ ప్లేట్ వాహనాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి.
కరోనా దెబ్బతీస్తోంది
డ్రైవర్లు బాగుండాలని గత ఏడాది కరోనా పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మోటార్ వాహన పన్ను రద్దు చేసింది. ఇప్పుడిప్పుడే కోల్కొంటున్న మాకు మళ్లీ కరోనా, ఒమిక్రాన్‌ల పరిస్థితుల కారణంగా నిరాశ ఎదురవుతుంది. పండుగల సమయంలోనైనా గిరాకీ చేసుకుందామనుకుంటే వైట్ నెంబర్ ప్లేట్స్ వాహనాలు, కొన్ని ట్రావెల్ బస్సులతో మాకు నష్టం చేకూరుతుంది.
వైట్ ప్లేట్ వాహనాలతో నష్టం
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎక్కువగా నగరం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ట్రిప్స్ దొరుకుతాయి. పండుగకు ఊరెళ్లే ఆంధ్రవాళ్లు చాలా మంది ఉంటారు. ఏడాది అంతా బిజినెస్ ఒక ఎత్తయితే.. సంక్రాంతికి వచ్చే బిజినెస్ రెట్టింపుగా ఉంటుంది. కానీ వైట్ నెంబర్ ప్లేట్ వాహనాలు ప్రయాణికులను ఎక్కించుకుని చలామణి అవుతుండటం మాకు నష్టం చేకూరుస్తుంది. ఈ దందాను అధికారులు కట్టడి చేయకపోతే మా ఉపాధిపై దెబ్బ పడుతుంది. ఇదేంటని మేం ప్రశ్నిస్తే మాపైనే కొంతమంది వైట్ నెంబర్ ప్లేట్ వాహనాల వాళ్లు దాడులు చేస్తున్నారు.