ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం సెక్రటేరియట్ ముట్టడికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్కళాశాల నుంచి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
సచివాలయం ముట్టడి ఉద్రిక్తం
ఖైరతాబాద్, ఏప్రిల్ 17: పార్ట్ టైం ఉద్యోగులు, అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సచివాలయం ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున ఉద్యోగులు సచివాలయంలోకి చొచ్చుకువెళేదుకు ప్రయత్నించగా, భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనేక మందిని అరెస్టు చేసి వివిధ పోలీసుల స్టేషన్లకు తరలించారు. పార్ట్ టైం ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. డిమాండ్లను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
గాంధీభవన్ ముట్టడికి యత్నం..
అబిడ్స్ ఏప్రిల్ 17 : రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గురువారం గాంధీ భవన్ ముట్టకి యత్నించారు. ఈ క్రమంంలో వారిని బేగం బజార్ పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ నాయకులు డాక్టర్ ఉపేందర్, డాక్టర్ విజేందర్ రెడ్డి, డాక్టర్ వేల్పుల కుమార్, తెలంగాణ యూనివర్సిటీ నాయకులు డాక్టర్ కిషన్, డాక్టట్ నారాయణ గుప్తా, కిరణ్ రాథోడ్, పాలమూరు వర్సిటీ నాయకులు.. డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ సోమేశ్, జేఎన్టీయూ అధ్యాపకులు సురేష్ నాయక్, ఎస్ కుమార్, మారుతి మహిళా అధ్యాపకులు డాక్టర్ సునీత, డాక్టర్ సరిత, వినీత, రేష్మ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.